కాబూల్ లో మళ్లీ కలకలం.. రాకెట్లతో విరుచుకు పడ్డ ఐసిస్-కే

by Anukaran |
afgan
X

కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం అయింది. సోమవారం కాబూల్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా ఉగ్రవాదులు ఐదు రాకెట్‌ బాంబులను ప్రయోగించగా, వాటిని విమానాశ్రయంలోని క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చేసింది. దీంతో పెనుముప్పు తప్పింది. అఫ్ఘాన్ నుంచి తరలింపు ప్రక్రియ గడువు ముగియడానికి ఒకరోజు ముందు జరిగిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యూఎస్ అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవలి జంట పేలుళ్ల ఘటన అనంతరం అఫ్ఘాన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో 13మంది అమెరికా భద్రతా సిబ్బంది సైతం ఉన్నారు.

ఈ మారణహోమాన్ని మరవకముందే ఉగ్రవాదులు ఆదివారం మరో రాకెట్ దాడికి పాల్పడ్డారు. విమానాశ్రయం సమీపంలోని ఖజే బాఘ్రా ప్రాంతంలోని ఓ నివాస గృహంపైకి దూసుకొచ్చిన రాకెట్ అక్కడే పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో మహిళా, చిన్నారి ఉన్నారు. ఈ దాడి నుంచి తేరుకోకముందే అదే రోజు కాబూల్‌ విమానాశ్రయంలో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి యత్నించాడు. యూఎస్ పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదిపై అమెరికా బలగాలు ఎయిర్‌స్ట్రైక్ జరిపాయి. ఫలితంగా పెనుముప్పు తప్పింది. ఇలా ఆదివారం ఒకేరోజు అటు ఉగ్రవాదుల రాకెట్ దాడి, ఇటు యూఎస్ ఎయిర్‌స్ట్రైక్ మోతలతో కాబూల్ దద్దరిల్లింది. ఈ ఆందోళన నుంచి స్థానికులు బయట పడకముందే సోమవారం భారీ ఉగ్రదాడికి యత్నించడం కలకలం రేగింది.

ప్రత్యేకమైన కారులో వచ్చి..
కాబూల్ విమానాశ్రయంపై సోమవారం రాకెట్ దాడికి యత్నించిన ఉగ్రవాదులు ప్రత్యేకమైన కారులో వచ్చారు. కారులో రాకెట్‌కు ప్రయోగించేందుకు లాంచర్లను అమర్చారు. మొత్తం ఆరు లాంచర్ ట్యూబ్‌లను కారు వెనుక సీటు భాగం నుంచి డిక్కీ మీదుగా బయటకు బిగించారు. ఈ కారును ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఖైర్ ఖానా ప్రాంతంలోకి తీసుకువచ్చి నిలిపారు. అనంతరం ఎయిర్‌పోర్టు లక్ష్యంగా వరుసగా ఐదు రాకెట్ బాంబులను వదిలారు. విమానాశ్రయంలోని సీ-ర్యామ్ అనే క్షిపణి రక్షణ వ్యవస్థ ఆటోమెటిక్‌గా రాకెట్‌లను గుర్తించి మిషిన్ గన్‌లతో కూల్చివేసింది. అనంతరం కారుపైనా దాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాదులెవరూ చనిపోలేదని యూఎస్ బలగాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. రాకెట్ దాడికి యత్నించింది తామేనని ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది సైతం ఈ సంస్థనే కావడం గమనార్హం.

Advertisement

Next Story