మంత్రి పేర్ని నాని శుభవార్త… త్వరలో నియామకాలు

by srinivas |   ( Updated:2021-06-23 07:02:24.0  )
మంత్రి పేర్ని నాని శుభవార్త… త్వరలో నియామకాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో పేర్ని నాని మమేకమయ్యారు. అనంతపురం, కర్నూలు, తూర్పు గోదావరి, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని మాట్లాడుతూ త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉందన్న ఆయన.. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉందన్నారు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో జగనన్న ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందని హామీ ఇచ్చారు. సర్వీస్ రూల్స్ పై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత నియామకాలు చేపడతామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

Advertisement

Next Story