ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు

by Anukaran |
ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు
X

దిశ,విశాఖపట్నం: సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా మూడు జిల్లాలుగా అవతరించబోతుంది. ఏపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుండటంతో వాటి పనులు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లా ఏజెన్సీ 11 మండలాలతో కలిసి 28 మైదాన ప్రాంత మండలాలు, విశాఖ నగర పరిధిలో మరో 6 మండలాలు విస్తరించి ఉంది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గం ఇక విజయనగరం జిల్లాలోకి చేరనుంది. విశాఖ జిల్లాగా భీమిలి, గాజువాకతో పాటు విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజక వర్గాలు తో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

ఇక అనకాపల్లి జిల్లాగా అనకాపల్లి నియోజకవర్గం తోపాటు ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటితో కలిపి కొత్తగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. అటు అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అరకు, పాడేరు, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండనున్నాయి. విజయనగరం జిల్లాలో ఉన్న కురుపాం, పార్వతీపురం, సాలూరు తో పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గాలు ఇప్పటి వరకూ అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.

అయితే అరకు పార్లమెంట్ రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణం గల నియోజకవర్గం కావడంతో దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. దీంతో పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే విశాఖ జిల్లాలో ఉన్న అరకు, పాడేరు నియోజకవర్గాలు ఒక జిల్లాగా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం కేంద్రంగా సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా లో ఉన్న పాలకొండ ను కూడా పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.

ఇప్పటికే పార్వతిపురం కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీలలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు పై హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు జిల్లాల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల గా అవతరించిన ఆంధ్ర ప్రదేశ్ త్వరలోనే కొత్త జిల్లాలతో ఏర్పాటు కానుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రాన్ని32 జిల్లాలుగా మార్పులు చేస్తారంటూ ఓవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాన్ని సైతం రెండు జిల్లాలుగా విభజించి పలాస కేంద్రంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పార్వతీపురం ఉండగా… శ్రీకాకుళం లో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజంగా మార్పు చేయనున్నారు.

చురుగ్గా భవనాల గుర్తింపు….
ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నూతనంగా ఏర్పడే జిల్లాలోని ప్రధాన కేంద్రాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో నూతన కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి భవనాలను సైతం అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే విశాఖ ఏజెన్సీ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ప్రస్తుత్తం ఉన్న భవనాలతో పాటు, ఆద్దె భవనాలు, ఇతర ఖాళీ భవనాల వివరాలను సైతం సిద్దం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్‌, ఆరోగ్యశాఖ, విద్యాశాఖలకు ఇప్పటికే ఆయా శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో వారంతా ఆయా భవనాలను గుర్తించడంతో వాటి ఫోటోలను సైతం సిద్దం చేసి ఉండటం విశేషం.

అయితే ప్రభుత్వం జనవరి 26 తరువాత నూతన జిల్లాల ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగానే అధికారులు సిద్దమవుతున్నారు. అయితే వాస్తవానికి నూతన జిల్లాల ప్రకటన చేసిన నాటి నుంచి నిబంధనల ప్రకారం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, తిరిగి వాటిపై ఉన్నతాధికారులు పరిశీలన చేసి మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు దాదాపుగా ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌ ఐఏఎస్ అధికారి‌ తెలిపారు.

Advertisement

Next Story