పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వ వినూత్న వ్యూహం

by Anukaran |
పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వ వినూత్న వ్యూహం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో రైతులు, మహిళా సమాఖ్యలను అనుసంధానిస్తూ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రైమ్​ మినిస్టర్​ ఫార్మలైజేషన్​ ఆఫ్​ మైక్రో ఫుడ్​ప్రాసెసింగ్’ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పదమూడు రకాల ఫుడ్ ప్రాసెసింగ్​ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక సీఎం జగన్​ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో జీడి పప్పు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో మామిడి, విశాఖపట్నంలో చెరకు, తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి, పశ్చిమ గోదావరిలో ఆక్వా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి, పసుపు, నెల్లూరులో నిమ్మ, చిత్తూరులో టమోటా, కడపలో అరటి, కర్నూల్లో ఉల్లి, అనంతపురంలో వేరుశనగ పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ ​యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని సర్కారు ప్రణాళిక రూపొందించింది. వీటికి సంబంధించి లాబొరేటరీ, స్టోరేజీ, ప్యాకింగ్, మార్కెటింగ్ ​తదితర సదుపాయాల కోసం రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లు వెచ్చించనుంది. ఓ యూనిట్​విలువలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం భరిస్తుండగా మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

ఈ రంగంలో ఎమ్​ఎస్​ఎమ్​ఈ కింద మొత్తం 10,035 యూనిట్లను నెలకొల్పేందుకు సర్కారు ప్రోత్సహిస్తోంది. ఆయా యూనిట్లకు బ్యాంకు రుణంతో కూడిన సబ్సిడీ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈపాటికే ఆయా జిల్లాల్లో నెలకొల్పిన ఇలాంటి ఫుడ్ ​ప్రాసెసింగ్​ యూనిట్లను సమర్థవంతంగా కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ యూనిట్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో తగిన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ ​సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వైపు నుంచి కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed