వైసీపీకి బిగ్ షాక్.. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల రాజీనామా..!

by srinivas |   ( Updated:2024-01-26 12:31:05.0  )
వైసీపీకి బిగ్ షాక్.. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల రాజీనామా..!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మార్పులతో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వేల్లో నెగిటివ్‌లు రావడంతో ఓ వైపు సీఎం జగన్ సిట్టింగులకు సైతం సీట్లు నిరాకరిస్తున్నారు. మరోవైపు అసంతృప్త నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ రాజకీయాలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి సీఎం జగన్‌కు అండగా ఉన్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు చంద్రశేఖర్ తీవ్రంగా కృషి చేశారు. జగన్ పాదయాత్రలో సైతం ఆయన వెంటే ఉన్నారు. అలాంటి ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. తన సొంత నియోజకవర్గంపెనమూలురు సీటు ఆశించి భంగపడ్డారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేశ్‌‌కు సీఎం జగన్ సీటు కేటాయించారు.

గుర్రుగా తుమ్మల..!

దీంతో వైసీపీ అధిష్టానంపై తుమ్మల చంద్రశేఖర్ గుర్రుగా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మంత్రి జోగి రమేశ్ గెలుపునకు తాను గానీ, తన వర్గం సహకరించేదిలేదని డైరెక్ట్ అధిష్టానానికే చెప్పినట్ల తెలుస్తోంది. అటు బుజ్జగింపులను సైతం ఆయన లెక్కచేయలేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వైసీపీని వీడేందుకు సైతం వెనకాడడంలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు మరో స్థానిక కీలక నేత సైతం చంద్రశేఖర్ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి జోగి రమేశ్‌కు తాము కూడా సహకరించమని పడమట సురేశ్ బాబు కూడా తేల్చి చెప్పారట. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల అసంతృప్తితో ఈసారి ఎన్నికల్లో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పేటట్లు లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల చంద్రశేఖర్ వైసీపీ వీడుతుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక నుంచి ఆయన అడుగులు ఏ పార్టీ వైపు ఉంటాయోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై యోచనలో ఉన్న చంద్రశేఖర్ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed