హడలెత్తిస్తొన్న విశాఖ సీపీ.. బెంబేలెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు

by Anjali |
హడలెత్తిస్తొన్న విశాఖ సీపీ.. బెంబేలెత్తిపోతున్న కింది స్థాయి అధికారులు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ముక్కుసూటిగా వ్యవహరించే నిజాయితీపరుడైన రూల్ బుక్ అధికారిగా పేరొందిన విశాఖ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి పర్యటనలు, తనిఖీలతో పోలీసు శాఖను పరుగులు పెట్టించేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు నేరాలను స్వయంగా గుర్తించి చర్యలకు ఉపక్రమించడంతో క్రింది స్ధాయి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

అర్థరాత్రి రెండు గంటల పర్యటన..

అర్ధరాత్రి రెండు గంటల పాటుగా నగరంలో నెలకొన్న వాస్తవికత పరిస్థితులను పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలనేందుకు పోలీసు బాస్ చేపట్టిన ఈ పర్యటనతో పలు నేరాలు బయటపడ్డాయి. రహదారులపై బహిరంగ మద్యపానం చేస్తున్న వారిని పట్టుకొని అక్కడికక్కడే కేసు నమోదు చేయించారు. వైసీపీ ప్రభుత్వం బార్ లలో మద్యం ధరలను విపరీతంగా పెంచినప్పటికీ నుంచి విశాఖ లో బహిరంగ మద్యపానం ఎక్కువైంది. కార్లు, ఆటోల్లో ప్రధాన రహదారుల పక్కనే సేవిస్తున్నారు. దీంతో పాటు డ్రoక్ అండ్ డ్రైవ్ చేస్తున్న ఒకరిని పట్టుకొని కేసు నమోదు చేయించారు.

దొంగను పట్టించిన నెంబర్..

వ్యభిచారం కోసం ఉన్న బాధిత ట్రాన్స్ జెండర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓవర్ లోడ్ తో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల ఆటోను పట్టుకొని కేసు నమోదు చేయించారు. సీపీ ఇచ్చిన సమాచారంతో నెంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న కొన్ని ద్విచక్ర వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేశారు. నగరంలో ఒక చోట ప్రజలు దొంగను పట్టుకొని నిర్బంధించినట్లు ప్రజలకు ఫిర్యాదుల కోసం ఇచ్చిన నంబరు 7995095799 కు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు డీసీపీ (క్రైమ్స్) తో మాట్లాడి అక్కడకు పోలీసులను తక్షణం పంపి సదరు దొంగను అరెస్టు చేయించారు. సందర్శనలో చివరగా మహారాణి పేట పోలీసు స్టేషన్ కు వెళ్లిన సిపి అక్కడ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును స్వయంగా పరిశీలించి, స్టేషన్ జనరల్ డైరీలో తన విజిటింగ్ అవర్స్ ను రాసి వచ్చారు. అర్ధరాత్రి పోలీసు కమీషనర్ నేరుగా పోలీసు స్టేషన్ కు రావడంతో పోలీసు సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

7995095799 కు ఫోన్ చేయండి..

విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో గల ప్రజలు అందరూ 7995095799 నంబరును సద్వినియోగం చేసుకోవాలని శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు ఎటువంటి సమాచారం కలిగి ఉన్నా, ఎవరైనా పోలీసులు పట్టించుకోవడం లేదన్నా, లంచం అడిగినా లేదా తీసుకున్నా అటువంటి సమస్యలు ఉన్నా పై నంబరు ద్వారా స్వయంగా తెలియజేయవచ్చిన స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచుతామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed