బాబోయ్.. విశాఖ వద్దు!

by srinivas |
బాబోయ్.. విశాఖ వద్దు!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వం ఇలా మారిందో లేదో విశాఖలో చిత్ర విచిత్రమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత డిమాండు వున్న పోలీసు కమిషనరేట్‌గా పేరుపడ్డ విశాఖ పోలీసు కమిషనరేట్లోకి వచ్చేందుకు కాదు, ఇక్కడినుంచి బయటకు వెళ్లేందుకు అధికారులు అదే పనిగా పైరవీలు చేసేస్తున్నారు. అత్యంత నిజాయితీపరుడు, రూల్ బుక్ అధికారిగా పేరొందిన శంఖభ్రత బాగ్చీ రావడంతో విశాఖపై ఆశలు పెట్టుకొన్న ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ కమిషనరేట్‌లో పోస్టింగ్ పడకుండా చూడండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, మరో వైపు రెడ్ బుక్ పేరిట హడావుడి చేసి కూటమి పెద్దలు- అత్యంత వివాదాస్పదుడు, నిబంధనలకు విరుద్ధంగా వైపీపీ నేతలు చెప్పిందే చేసిన మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సాయికాంత్ వర్మను మార్చకుండా రక్షిస్తుండడంతో ఇప్పుడు జీవీఎంసీకి డిమాండ్ పెరిగింది.

బాబోయ్ బాగ్చీ

బాగ్చీ నాలుగు రోజుల క్రితం విశాఖ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలంటూ పోలీసులకు సున్నితంగా హెచ్చరిక జారీ చేశారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడమే కాకుండా ఫిర్యాదుల కోసం ఒక మొబైల్ నెంబర్ ను ప్రకటించారు. ఎవరైనా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించవచ్చని, 24 గంటలు ఆ నెంబర్ అందుబాటులో వుంటుందని చెప్పి సంచలనమే సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే పెందుర్తిలో ప్రజలతో సమావేశమయ్యారు. అన్ని పోలీసు యూనిట్లను మూడు రోజుల్లో తనిఖీ చేసేసి తగిన సూచనలు జారీ చేశారు. కొత్త పోలీసు మిషనర్ స్పీడ్ చూసి క్రిందిస్దాయి అధికారులు వణికిపోతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం రాగానే డీఎస్పీ పోస్టుకు 20, 25 లక్షలు, సీఐ పోస్టుకు పది లక్షలు సమర్పించుకొంటామంటూ నేతలు, ప్రజా ప్రతినిధులు చుట్టూ తిరిగిన పోలీసు అధికారులంతా ఇప్పుడు దయచేసి తమను విశాఖ కమిషనరేట్‌కు సిఫార్సు చేయవద్దని వారినే వేడుకొంటున్నారు. దూరంగా వున్న మన్యంలో అయినా ఇబ్బందిలేదు గానీ, బాగ్చీ వుండగా విశాఖ సిటీకి రామనేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన యోగానంద్ హయాంలో కూడా పరిస్థితులు ఇలానే వుండేవి.

రివర్స్‌లో జీవీఎంసీ

అయితే, పోలీసు కమిషనరేట్‌కు పూర్తి భిన్నంగా జీవీఎంసీ పరిస్థితులు తయారయ్యాయి. విశాఖలో వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఎం వీ వీ సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌లు ఏం చెబితే అదే చేసిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను ఇంకా బదిలీ చేయకపోవడం పార్టీనేతలనే ఆశ్చర్య పరుస్తోంది. ముద్దాడ రవిచంద్ర, ప్రద్ముమ్నల పేరు చెబుతూ తానే కొనసాగుతానని ఆయన చెబుతుండడంతో లోకేశ్ రెడ్ బుక్ ఇలాగే వుంటుందా? అని సాటి తెలుగుదేశం నేతలే ప్రశ్నలు వేస్తున్నారు. విశాఖ, అనకాపల్లిల్లో అసలు అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలు కట్టేయడానికి, మాజీ మంత్రి అమర్ కమర్షియల్ కాంప్లెక్స్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీబీసీఎన్సీ, హయిగ్రీవ కట్టడాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిందీ, వందల కోట్ల అక్రమ టీడీఆర్ లు మంజూరు చేసిందీ సాయికాంత్ వర్మే. టైకూన్ జంక్షన్ ను మూసేయడం, సిరిపురం జంక్షన్ సుందరీకరణ పేరిట గందరగోళంగా తయారు చేయడం, వేసవిలో జనానికి తాగునీరు ఆపి ఇనార్బిట్ మాల్ కు రోజుకు రెండు లక్షల లీటర్లు పంపిణీ చేయడం, తొమ్మిది కోట్లతో కౌన్సిల్ అనుమతులు లేకుండా గుర్రాల శిక్షణా కేంద్రం కట్టడం వంటి వివాదాస్పద నిర్ణయాలన్నింటికీ ఆయనే కారణం. విశాఖలో కూటమికి ఐదు లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందంటే అందుకు మాజీ కలెక్టర్ మల్లికార్జునతో పాటు సాయికాంత్ వర్మ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కారణమయ్యాయని వైసీపీ నేతలే మండిపడుతున్నారు. అటువంటి సమయంలో రెడ్ బుక్ పేరిట హడావుడి చేసి వైసీపీ ముద్ర వేయించుకొన్న అధికారులను కాపాడడమేమిటో కూటమి నేతలకే అంతుబట్టడం లేదు. సాయికాంత్ వర్మ కొనసాగనున్నారని తెలిసి పలువురు అవినీతి పరులైన అధికారులు, పైరవీ కారులు జీవీఎంసీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed