కిలాడీ లేడి దారుణమైన దందా.. విశాఖ హనీ ట్రాప్ లో వెలుగుచూసిన సంచలన విషయాలు

by Rani Yarlagadda |
కిలాడీ లేడి దారుణమైన దందా.. విశాఖ హనీ ట్రాప్ లో వెలుగుచూసిన సంచలన విషయాలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పెళ్లి పేరిట యువకులు మోసం చేయడం చూశాం. విచిత్రంగా విశాఖలో ఓ యువతి ఏకంగా ముఠాను ఏర్పాటు చేసి ప్రేమ, పెళ్లి పేరిట పెద్ద దందానే నడుపుతోంది. ఆ యువతి పేరు కొరుప్రోలు జాయ్ జమీమ.. వయస్సు జస్ట్ జస్ట్ పాతికేళ్లు. విశాఖలోని మురళీనగర్ ఎన్జీవో కాలనీలో ఇళ్లు.. కానీ ఆమె మరో నలుగురైదుగురితో కలిసి చేస్తున్న మోసాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కుదిపేస్తున్నాయి. ప్రేమ పేరిట వలలో దింపి ఒక ఎస్ఆర్‌ఐని బెదిరించడం ఒక ఎత్తయితే.. ముఠా సభ్యులు ఎంచుకున్న మోసం తీరు దారుణాతి దారుణంగా ఉంది.

ఇన్ స్టాలో పరిచయం

ఇన్ స్టాగ్రామ్‌లో ఓ యువకుడ్ని (విదేశాల్లో ఉంటున్నాడు.. వివరాలు బయటకు చెప్పొద్దని పోలీసుల్ని కోరాడు) నచ్చి ప్రేమిస్తున్నానంటూ జాయ్ జమీమ చాటింగ్ మొదలెట్టింది. విశాఖలో ఉంటున్న యువకుడి తల్లిదండ్రులను కూడా కలిసి తన ప్రేమను తెలియజేసింది. వారు నిరాకరించినా కాళ్లా..వేళ్లా పడింది. అంతేనా విదేశాల నుంచి అర్జంట్‌గా రావాలంటూ ఒత్తిడి చేసింది. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన అతడిని తన ముఠా సభ్యులతో కలిసి చాలా గ్రాండ్‌గా రిసీవ్ చేసుకుంది. తొలుత తన తల్లిదండ్రులను కలవాలని ఆ యువకుడు చెబుతున్నా..అక్కడకు వెళ్తే వాళ్లు తమ ప్రేమకు అడ్డు చెబుతారంటూ వెళ్లకుండా చేశారు.

ఇంటికి వెళ్లనీయకుండా రిసార్ట్‌కు ..

విదేశాల నుంచి వచ్చీ రాగానే ఆ యువకుడిని జాయ్ జమీమ సహా ముఠా సభ్యులు నగరం నుంచి బయటకు వెళ్లకుండా మాయ మాటలు చెప్పారు. అర్జెంట్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని చెప్పడంతో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిసార్ట్ లో వాళ్లు చెప్పినట్టే చేసి యువకుడు రూ.5 లక్షలు బిల్లు కూడా చెల్లించాడు. ఆ రాత్రయినా తనింటికి వెళతానని ఎస్ఆర్‌ఐ యువకుడు బలవంతం చేసినా ముఠా సభ్యులు బెదిరించారు. చివరకు మురళీనగర్‌లోని ఎన్జీవో కాలనీలోని తన ఇళ్లు అని యువతి చెప్పిన అడ్రెస్‌కు తీసుకువెళ్లి యువకుడ్ని నిర్భంధించారు.

మత్తు పానీయాలతో వశం.. వీడియోలతో మోసం

అక్కడ మత్తు పానీయాలు ఇచ్చి యువతి తన వశం చేసుకుంది. ఓ రకమైన స్ప్రే చేసి కింద పడిపోయేలా చేసింది. అంతేనా ముఠా సభ్యులతో కలిసి ఆమెను ఆ అబ్బాయి రేప్ చేశాడు అన్నట్టుగా ఫోటోలు, వీడియోలు తీయించింది. ఇవేవీ పాపం ఆ కుర్రాడికి తెలీవు. మత్తు వదిలాక బయటకు వెళ్తానని చెప్పగా ఆ ఆధారాలన్నీ చూపించి తమకు భారీ మొత్తంలో డబ్బులివ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు పెడతామని, బయటకు చెబితే చంపేస్తామని, విదేశాలు వెళ్లకుండా చేస్తామని, ఉద్యోగం తీయించేస్తామని ముఠా సభ్యులు బెదిరించేసరికి తాను అన్ని విధాలా మోసపోయానని ఆ యువకుడికి అర్థమైంది. డబ్బులు తెప్పి స్తానంటూ తల్లిదండ్రులకు చెబుతూనే తనకు జరిగిన అన్యాయాన్ని బాధితుడు మెల్లగా అమ్మానాన్నల చెవిలో వేశాడు. దీంతో వారు ఈ నెల 4న భీమిలి పోలీసులను ఆశ్రయించి, దయజేసి తమ వివారాలు బయట పెట్టొద్దని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు కొరుప్రోలు జాయ్ జమీమను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు.

బుట్టలో పడిన మరో వివాహితుడు

మరో కేసు జమీమ బృందం ఉచ్చులో కంచరపాలెంకు చెందిన ఓ వివాహితుడు కూడా పడ్డాడు. ఎస్ఆర్‌ఐ యువకుడి ఆవేదన బయట పడడంతో ఈ బాధితుడు కూడా స్థానిక పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆ ముఠా సభ్యుల ఘోరాలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయి. వాస్తవానికి జమీమను అడ్డుపెట్టుకుని ముఠా సభ్యులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మోసాలు చేశారని, డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులను టార్గెట్ చేసుకుని, వారికోసం ఆరా తీసి, రెక్కీ నిర్వహించి ఈ విధంగా మోసాలు చేయడంలో వీరంతా దిట్ట అని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత ఐగ్బీ ఆదివారం మీడియాకు తెలియజేశారు. జమీమను అరెస్టు చేసినా మిగతా వారికోసం గాలిస్తున్నామని, వీరు ఎంతో మందిని ముంచేసినట్టు తెలుస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed