పాపం.. రజిని!.. టీడీపీ కంచుకోటలో కాలుమోపిన మంత్రి

by Shiva |
పాపం.. రజిని!.. టీడీపీ కంచుకోటలో కాలుమోపిన మంత్రి
X

రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రముఖ నేతగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తనదైన ముద్ర వేసుకున్నారు. తొలుత టీడీపీ నుంచి ఆరంగేట్రం చేసినా గత ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకొని చిలకలూరిపేట నుంచి విజయం సాధించారు. అంతేకాదు. ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కాలక్రమేనా చిలకలూరిపేటలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట అని తెలిసి కూడా ఇక్కడకు మారడం రజిని సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైఎస్ జగన్ గాలి వీచినా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మద్దాళి గిరి విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలో నిలిచిన చంద్రగిరి ఏసు రత్నం ఓడిపోయారు. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు గెలిచినా.. తన ప్రాబల్యం తగ్గిపోతుందనే భావనతో ఆ నియోజకవర్గానికి చెందిన అదే పార్టీ కీలక నేత చిత్తశుద్ధితో కృషి చేయలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దఫా ఎన్నికల్లోనూ సదరు నేత అదే పంథానే కొనసాగిస్తారని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇవన్నీ తెలిసినా మంత్రి రజిని అదే నియోజకవర్గాన్ని ఎలా ఎంచుకున్నారోనంటూ వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

టీడీపీకి కంచుకోట..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆది నుంచి టీడీపీ అడ్డాగా ఉంది. 2009లో ఒక్కసారి మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్​ నుంచి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా టీడీపీనే గెలుస్తూ వస్తుంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు సీటు లేదని వైసీపీ అధిష్టానం తేల్చేసింది. దీంతో ఆర్యవైశ్యులు భగ్గుమంటూ రోడ్డెక్కారు. ఈ దఫా వైసీపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

గతంలో పని చేయని బీసీ కార్డు..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. అందుకే రజినికి ఈ స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ బీసీ కార్డు ఉపయోగించినా వైసీపీకి ఇక్కడ ఓటమి తప్పలేదు. ఎలాగైనా ఈ దఫా ఇక్కడ బోణీ కొట్టాలని వైసీపీ ఎత్తుగడలకు పదును పెడుతోంది. డిసెంబరు 31న అర్థరాత్రి మంత్రి రజిని నూతనంగా ఏర్పాటు చేసుకున్న కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. గతంలో నేతలు ఎంత తీవ్ర స్థాయిలో పోటీపడినా దాడులు చోటుచేసుకోలేదు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో రాళ్ల దాడితో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలిసి మరి టీడీపీ అడ్డాలో రజిని అడుగు పెట్టడమంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని విశ్లేషకుల అంచనా.

Advertisement

Next Story

Most Viewed