- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరుపై అగ్రనేతల గురి..!
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాపై అగ్ర నేతలు గురి పెట్టారు. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు.. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి భారత్ ప్రసాద్‌కు మద్దతుగా జరిగిన బహిరంగ సభకు మోడీ హాజరుకాగా, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఆరుసార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలు సమావేశాలలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలోను రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన విషయం పాఠకులకు విధితమే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాలలో జరిగిన బస్సు యాత్ర, కార్నర్ సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్, బీజేపీలపై దుమ్మెత్తి పోసి రాజకీయాల్లో కాక రేపారు.
ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయం
ఒకవైపు కాంగ్రెస్ మరో వైపు బీజేపీ నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అగ్ర నాయకులను ఆహ్వానించి ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు తలమునకలు అవుతున్నారు. ఈనెల 5న జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడం, అక్కడ బీఆర్ఎస్, బీజేపీ పటిష్టంగా ఉండడంతో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వీలుగా బహిరంగ సభ నిర్వహణకు ఎర్రవల్లిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహరచనలతో ముందుకు సాగుతున్నారు.
మే 9 లేదా 10న నారాయణపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రధాని సభను నిర్వహించడం ద్వారా పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పట్టు సాధించడంతో పాటు. అన్ని నియోజకవర్గాలలో పట్టు సాధించవచ్చు నమ్మకంతో నారాయణపేటలో సభను నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రధాని సభతో పాటు మహబూబ్ నగర్, షాదనగర్లలో కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొని సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున హరీశ్ రావు, కేటీఆర్ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ పది రోజులలో అగ్రనేతల రాక.. రాజకీయ కాకను మరింతగా పెంచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.