‘వైసీపీపై తిరుగుబాటు మొద‌లైంది..! వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..’

by Sathputhe Rajesh |
‘వైసీపీపై తిరుగుబాటు మొద‌లైంది..! వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..’
X

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పేరు చెబితే చాలు ఠక్కున గుర్తొచ్చే పేరు వ‌ర్మ‌. టీడీపీ పేరే ఆయ‌న ఇంటిపేరులా మారిపోయింది. అందుకే ఆయ‌నను టీడీపీ వ‌ర్మ అంటారు. కాకినాడ జిల్లాలో అత్య‌ధిక కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు ఉన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ క్ష‌త్రియుడు పాగా వేశారంటే అది ఆయ‌న సేవా గుణ‌మ‌నే చెప్పాలి.

ముక్కు సూటి త‌నం, ప‌ట్టుద‌ల క‌ల‌గ‌లిపి వ‌ర్మ‌ను ఉహించ‌ని స్థాయిలో ఓ ఉన్న‌త నేత‌గా నిల‌బెట్టారు ఇక్క‌డ ప్ర‌జ‌లు. నిత్యం జ‌నంలో ఉండ‌టం ఆయ‌న నైజం. అయిన‌ప్ప‌ట‌కీ ఏక చ‌త్రాధిప‌త్యం అనే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న సంద‌ర్బాలు లేక‌పోలేదు. 2019 ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌తో ఉన్న వారే ఆయ‌న‌పై తిరుగుబాటు చేశారు. అయినా వెనకడుగు వేయకుండా ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఆయన బలమెంత, బలగమెంత అనే విషయంపై వర్మ దిశ పత్రికతో తన మనోగతాన్ని పంచుకున్నారు.

దిశ, కాకినాడ‌: జ‌నం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడేందుకు భయపడుతున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌లో ఎమ్మెల్యేల‌కు చుక్కెదురవుతోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నారు. త్వ‌ర‌లో మ‌రింత‌ తిరుగుబాటు వ‌స్తుంది. ప‌థ‌కాల పేరుతో అంతా మోసం చేస్తున్నారు జ‌గ‌న్ ను నమ్మ‌డం అనే స్లోగ‌న్ వింటుంటే నవ్వుకుంటున్నారు. నిరుద్యోగుల‌ను మోసం చేసిన ఘ‌నుడు జ‌గ‌న్‌. ఏలేరు ఆధునికీక‌ర‌ణ‌కు నిధులు వెచ్చించాం. కానీ అందులో ఒక్క శాతం ప‌నుల‌ను కూడా వైసీపీ చేయ‌లేక‌పోయింది. తాండ‌వ నీటిని పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబు, కాకినాడ ఎంపీ గీత‌ అమ్ముకున్నారు. రాజ‌ధాని రైతుల‌కు ఈ ప్ర‌భుత్వం న‌ర‌కం చూపిస్తోంది. అన్ని వర్గాలనూ జగన్ మోసం చేశారు.

స్కామ్‌లు చేశార‌ని వైసీపీకీ ఓట్లు వేయాలా..?

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు ఏం చేశార‌ని ప్ర‌జ‌ల‌కు ఓట్లు వేస్తారో ఆయ‌నే చెప్పాలి. క‌నీసం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. సొంత వ్య‌క్తుల అక్ర‌మాల‌కు వంత పాడిన ఎమ్మెల్యే దొర‌బాబుకి రాబోయే ఎన్నిక‌లు ఓ గుణ‌పాఠం అవుతాయి. మ‌ట్టి, గ్రావెల్‌, ఇసుక మాఫియాల‌తో ఇక్క‌డ వైసీపీ నేత‌లు చెల‌రేగిపోయారు. పిఠాపురం టీడీపీకి వైసీపీ పోటీయే కాదు. సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే దొర‌బాబును బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు. ఎమ్మెల్యే దొర‌బాబు ఇళ్ల స్థ‌లాలు కొనుగోళ్ల విష‌యంలో కోట్లు కొల్లగొట్టారు. గొల్ల‌ప్రోలు మండ‌లం దుర్గాడ గ్రామంలో ఇళ్ల ప‌ట్టాల విష‌యంలో వైసీపీ నేత‌లు వ‌సూళ్లు నిజం కాదా ? జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌ట్టాల్లో భాగంగా 62 ఎక‌రాలు కొనుగోలు చేశారు. ఇందులో 4 వేల మందికి ప‌ట్టాలు ఇచ్చారు. ఈ రోజుకీ అందులో ఒక్క‌రికీ స్థ‌లం చూపించ‌లేదు. మ‌రోప‌క్క టిడీపీ హ‌యాంలో ఇచ్చిన టిడ్కో గృహాల‌కు దిక్కూమొక్కూ లేదు.

కాపుల‌కు మేలు ఏం చేశారో చెప్పాలి..

అన్ని సామాజిక వ‌ర్గాలు బాగుండాల‌నేది టీడీపీ అభిమతం. అందుకే తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ప్ర‌తీ సామాజిక వ‌ర్గానికి స్థ‌లం కేటాయించామ‌ని, కానీ వైసీపీ అధికారం చేప‌ట్టాక‌ అదే స్థ‌లాల‌ను ఎమ్మెల్యే త‌న అనుచ‌రుల ద్వారా అమ్మ‌కానికి పాల్ప‌డ్డారు. టీడీపీ హ‌యాంలో కాపుల‌కు మేలు జ‌ర‌గ‌లేద‌ని, అంతా మోస‌మే జ‌రిగింద‌ని చెబుతున్న దొర‌బాబు ఇప్పుడు .. కాపుల‌కు, ఇత‌ర కులాల‌కు ఏం చేశారో చెబితే బాగుంటుంది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని కులాలు త‌న‌కు స‌మాన‌మే. తాను అంద‌రి వాడిని కాబ‌ట్టే గ‌తంలో నాకు విజ‌యం ద‌క్కింది. కుల రాజ‌కీయాలు చేసే అవ‌స‌రం లేదు. కేవ‌లం ప్ర‌జ‌లంద‌రూ బాగుండాల‌నేదే నా అభిమతం. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యం.

Advertisement

Next Story

Most Viewed