SA vs IND : వరుణ్ మాయ వృథా.. రెండో టీ20లో భారత్ ఓటమి

by Harish |
SA vs IND  : వరుణ్ మాయ వృథా.. రెండో టీ20లో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో తొలి టీ20 నెగ్గి శుభారంభం చేసిన టీమిండియాకు రెండో టీ20లో షాక్ తప్పలేదు. గెబేహా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 124/6 స్కోరే చేసింది. పాండ్యా(39 నాటౌట్) రాణించగా.. అక్షర్(27) విలువైన పరుగులు జోడించాడు. అనంతరం 125 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19 ఓవర్లలోనే ఛేదించింది. 7 వికెట్లు కోల్పోయి 128 స్కోరు చేసింది. ఆరంభంలో వరుణ్ చక్రవర్తి((5/17) ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తడబడింది. అయితే, ట్రిస్టన్ స్టబ్స్(47 నాటౌట్), గెరాల్డ్ కోయెట్జీ(19 నాటౌట్) నిలవడంతో సౌతాఫ్రికా విజయం సాధించింది.

వరుణ్ మాయ వృథా

ఛేదనలోనూ సౌతాఫ్రికా కూడా తడబడింది. వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఒక దశలో ఆ జట్టు ఓటమి అంచున నిలిచింది. ర్యాన్ రికెల్టన్(13)ను అర్ష్‌దీప్ అవుట్ చేయగా.. ఆ తర్వాత వరుణ్ స్పిన్ మాయ మొదలుపెట్టాడు. మార్‌క్రమ్(3), హెండ్రిక్స్(24), మార్కో జాన్సెన్(7), క్లాసెన్(2), డేవిడ్ మిల్లర్(2)లను వరుసగా అవుట్ చేసి ప్రత్యర్థి జట్టులో ఓటమి భయాన్ని సృష్టించాడు. సౌతాఫ్రికా 66 పరుగులకే 7 వికెట్లు కోల్పోడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. 7 వికెట్‌గా సిమెలానె(7)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ పంపే సమయానికి దక్షిణాఫ్రికా విజయానికి 26 బంతుల్లో 39 రన్స్ చేయాలి. వరుసగా వికెట్లు తీస్తుండటంతో భారత జట్టే గెలుస్తుందనుకున్నారంతా. కానీ, క్రీజులో పాతుకపోయిన ట్రిస్టన్ స్టబ్స్(47 నాటౌట్), గెరాల్డ్ కోయెట్జీ(19 నాటౌట్) టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరూ బ్యాటు ఝళిపించడంతో దక్షిణాఫ్రికా మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. దీంతో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృథా అయ్యింది.

తడబడ్డారు

తొలి టీ20 విజయంతో జోష్ మీద ఉన్న భారత ఆటగాళ్లు రెండో టీ20లోనూ అదే జోరు ప్రదర్శిస్తారని అంతా భావించారు. కానీ, భారత ప్లేయర్లు బ్యాటుతో తడబడ్డారు. 15 పరుగులే టాప్-3 వికెట్లు పడ్డాయి. గత మ్యాచ్‌లో శతక్కొట్టిన శాంసన్(0) అదే దూకుడును కొనసాగించలేకపోయాడు. తొలి ఓవర్‌లోనే డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ(4), కెప్టెన్ సూర్యకుమార్(4) కూడా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్(27), తిలక్ వర్మ(20) జట్టును పోటీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, తిలక్‌ను మార్‌‌క్రమ్ అవుట్ చేసి ఈ జోడీని విడదీయడంతో భారత్ 45/4తో కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే, మరో ఎండ్‌లో వికెట్లు పడటం ఆగలేదు. కాసేపటకే అక్షర్ అవుటవ్వగా.. రాణిస్తాడనుకున్న రింకు సింగ్(9) కీలక సమయంలో చేతులెత్తేశాడు. ఈ సమయంలో దూకుడుకు పోకుండా ఆచితూచి ఆడిన పాండ్యా.. అర్ష్‌దీప్(7 నాటౌట్) సహకారంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, సిమెలానె, మార్‌క్రమ్, పీటర్‌ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed