కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు : హోం మంత్రి వంగలపూడి అనిత

by Y. Venkata Narasimha Reddy |
కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు : హోం మంత్రి వంగలపూడి అనిత
X

దిశ, వెబ్ డెస్క్ : కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు కాల్ మనీ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ ఏలూరు ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూవారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేసే వారిని సహించబోమన్నారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్ గా జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed