ఇద్దరూ ఇద్దరే.. హామీల అమలులో ఉల్లం‘ఘనులే’

by Javid Pasha |   ( Updated:2023-10-10 11:44:23.0  )
ఇద్దరూ ఇద్దరే..  హామీల అమలులో ఉల్లం‘ఘనులే’
X

దిశ, ఏపీ బ్యూరో: వర్తమాన రాజకీయాల్లో హామీలు ఓటర్లను నమ్మించడానికే పనికొస్తున్నాయి. ప్రజలను ఎవరు ఎక్కువ నమ్మించగలిగితే వారే విజేత. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటి అమలులో చిత్తశుద్ధి లేశమాత్రం కూడా కన్పించడం లేదు. జగన్ అయినా, చంద్రబాబు అయినా తేడా ఏమీలేదు. ఇద్దరూ ఇద్దరే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, 2019 ఎన్నికల్లో జగన్.. తమ వాగ్దానాలతో ఓటర్లను బురిడీ కొట్టించి అందలమెక్కారు. 2014 ఎన్నికల్లో రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు బేషరతుగా రద్దుచేస్తామన్న చంద్రబాబు హామీని ప్రజలు నమ్మారు. ఆయనకే పట్టంగట్టారు. తర్వాతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సాధన, సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను ఓటర్లు నమ్మి వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. తామిచ్చిన హామీలను అమలు చేశామని టీడీపీ నేతలు గానీ, వైసీపీ నేతలు గానీ గుండెపై చెయ్యి వేసుకుని చెప్పగలరా?

మహానాడులో చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టోపై రెండు పార్టీల మధ్య భీకర మాటల యుద్ధం మొదలైంది. కర్నాటకలో కాంగ్రెస్​, బీజేపీలను కాపీ కొట్టారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న పథకాల సొమ్మును పెంచి ఏదో కొత్తగా ప్రకటించినట్లు చెప్పుకోవడమేంటని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తమ్ముళ్లు కూడా రెచ్చిపోతున్నారు. 2019లో జగన్​ ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. సీఎం జగన్​ హామీల చిట్టా విప్పుతున్నారు. నాడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేరలేదు.. ప్రస్తుతం జగన్​ హామీల్లో ఇంకా ఎన్ని నెరవేరలేదనే పరిశీలన చేస్తే..

నాడు నెరవేరని చంద్రబాబు హామీలు..

– వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరగలేదు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. పంటల బీమా పరిహారాన్ని రైతువారీ లెక్కించి ఇస్తామన్నదీ నెరవేరలేదు. రైతు రుణమాఫీ మీద పిల్లిమొగ్గలు వేశారు. చివరిదాకా నెట్టుకొచ్చి అనేక కొర్రీలు వేశారు. కౌలు రైతులను జాయింట్​ లయబుల్​ గ్రూపులుగా ఏర్పాటు చేసి పంట రుణాలు ఇస్తామన్నారు. పది శాతం కూడా ఇవ్వలేదు.

– మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీని కూడా నాన్చారు. ఎన్నికల ఏడాది చివర్లో పసుపు కుంకుమ కింద కొంత కొంత ఇచ్చి మమ అనిపించారు. మహిళల ఉపాధి, భద్రత గురించి చెప్పినవి ఒక్కటీ అమలు కాలేదు. వ్యవసాయ రంగంలో మహిళల నైపుణ్యాన్ని పెంచుతామన్న హామీ నెరవేరలేదు. దీపం పథకం కింద పేద కుటుంబాలకు ఉచితంగా ఇస్తామన్న గ్యాస్​ కనెక్షన్లు అరకొరగానే మంజూరు చేశారు.

– యువతకు సంబంధించి ఇంటికో ఉద్యోగమన్నారు. పారిశ్రామిక, సేవల రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్నా ఐటీకే ప్రాధాన్యమిచ్చారు. ఐదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలే వచ్చాయి. నిరుద్యోగ భృతి కొద్దిమంది పార్టీ కార్యకర్తలకే దక్కింది.

–వృద్ధుల పింఛన్లు వెయ్యికి ఎప్పుడోగాని పెంచలేదు. చాలా కాలం కొత్త పింఛన్లు ఇవ్వలేదు. ఎవరైనా చనిపోతే వాళ్ల స్థానంలో మరొకరికి ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ వృద్ధాశ్రమం నెలకొల్పుతామన్న హామీ నెరవేర్చలేదు.

– కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యని ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. విద్యార్థులకు ఐ ప్యాడ్లు ఇస్తామన్నారు. తర్వాత మర్చిపోయారు. ప్రైవేటు, కార్పొరేట్​ స్కూళ్ల దయాదాక్షిణ్యాలకు తల్లిదండ్రులను వదిలేశారు. ఫీజు రీయింబర్స్​మెంటు బకాయిలు పెట్టారు.

– బీసీలకు సంబంధించి 2012లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్​ ప్రకారం 100 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామన్నారు. పది వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. బీసీ ఉప ప్రణాళికన్నారు. అయినా ఆచరణకు నోచుకోలేదు.

– ప్రతీ జిల్లా, నగరం, పట్టణం, మండలానికి అందుబాటులో ఉన్న వనరులు, అవసరాల మేరకు ఎలా అభివృద్ధి చేస్తామనే విజన్​ డాక్యుమెంటు రూపొందించి అమలు చేస్తామన్నారు. అమలు కాలేదు.

– పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై ఉక్కుపాదం మోపుతామన్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పెట్రోలు, డీజిల్​ ధరలు తగ్గించకపోగా మరింతగా పెరిగాయి.

- ప్రజల నెత్తిన భారాలు మోపుతూ ప్రైవేటు విద్యుత్​ ఉత్పత్తి కంపెనీల ప్రయోజనాల కోసం కరెంటు చార్జీలు దారుణంగా పెంచేశారు.

– పేదల గృహ నిర్మాణానికి కేంద్రం ఇతోధికంగా గృహాలు మంజూరు చేసినా చాలా జిల్లాల్లో ఎన్నికల ఏడాదిలో మాత్రమే మొదలు పెట్టారు. మొత్తం ఆరు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే.. అందులో సుమారు 3 లక్షల టిడ్కో ఇళ్లు 80 శాతం మాత్రమే పూర్తి చేయగలిగారు.

– నాడు 13 జిల్లాలకు సంబంధించి గ్రోత్​ కారిడార్లుగా అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు సంబంధించి సుమారు 17 గ్రోత్​ కారిడార్లకు శ్రీకారం చుడతామన్నారు. ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.

నేటికీ అమలుకు నోచని జగన్​ హామీలు..

– ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించకుండా కొర్రీలు వేస్తున్నా కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితి. సాగునీటి ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ తప్ప ఏ ఒక్కటీ పూర్తి కాలేదు.

– విభజన హామీల్లో భాగమైన రామాయపట్నం మేజరు పోర్టు, కడప ఉక్కు కర్మాగారాన్ని సాధించలేకపోయారు.

– కొత్తగా తీసుకొచ్చిన కౌల్దారీ చట్టంలోని నిబంధనలు కౌలు రైతులను పెనంమీద నుంచి పొయ్యిలోకి తోసేశాయి. నేటికీ ఒక్క శాతం కౌలు రైతులూ ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకోలేకపోతున్నారు.

– ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్​ రద్దు హామీని విస్మరించారు. కాంట్రాక్టు, అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు రెగ్యులరైజేషన్​కు నోచుకోలేదు.

– 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అమలు కాలేదు. మెగా డీఎస్సీ గురించి పట్టించుకోవడం లేదు. స్కూళ్ల క్రమబద్దీకరణ పేరుతో ఉపాధ్యాయ ఖాళీలను కుదించారు.

– ఆశా వర్కర్లకు తెలంగాణ కన్నా అదనంగా రూ. వెయ్యి జీతం ఉండేట్లు పెంచుతామన్న హామీకి తూట్లు పడ్డాయి.

– పేదల గృహ నిర్మాణం 20 శాతం కూడా పూర్తి కాలేదు.

– 45 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛను అన్నారు. నేటీకీ ఆ ఊసే లేదు.

– అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలకైనా వర్తింపజేస్తామని ఒక్కరికే పరిమితం చేశారు.

– దశలవారీ మద్య నిషేధంతోపాటు ప్రతీ మండల కేంద్రంలో డీ ఎడిక్షన్​ కేంద్రం, వృద్ధాశ్రమం, నియోజకోవర్గానికో కోల్డ్​ స్టోరేజీ లక్ష్యం నెరవేరలేదు.

– ఉచిత బోర్ల పథకం ప్రారంభించినా తర్వాత కొన్నాళ్లకు నిలిపేశారు.

– నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిల్​ ధరలు తగ్గిస్తామన్నారు. కరెంటు, రవాణా చార్జీలు తగ్గిస్తామన్నా అమలుకు నోచుకోక పోగా మరింతగా భారాలు మోపారు.

–నగరిలో టెక్స్​టైల్​ పార్కు, పశ్చిమ గోదావరిలో మెరైన్​ యూనివర్శిటీ, ప్రకాశంలో మైనింగ్​ యూనివర్శిటీ హామీ నెరవేరలేదు.

– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కులాల కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి ఊతమిస్తామన్నారు. ఆయా కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంకా ఈపాటికే ఉన్న యువత స్వయం ఉపాధి పథకాలను రద్దు చేశారు. సంక్షేమ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించి నిర్వీర్యం చేశారు. నామినేటెడ్​ పనుల్లో ఎస్సీఎస్టీబీసీ, మైనార్టీలకు 50 శాతం కేటాయిస్తామన్న హమీ ఊసే లేదు.

– చట్టసభలకు నేరుగా ఎన్నిక కాలేని అల్పసంఖ్యాక బీసీలకు మండలిలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు.

– మూతపడిన చక్కెర, జూట్​ మిల్లులను తెరిపిస్తామన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు అసలు ప్రస్తావించడం లేదు.

– కుల వృత్తులకు స్వర్ణయుగం తెస్తామంటూ చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ ఎత్తివేయిస్తామన్నారు. రైతులకు మాదిరిగా కార్మికులకు బీమా వర్తింపజేస్తామన్నారు. వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం ఇప్పిస్తామన్నారు. ఇళ్లు, మగ్గాలకు షెడ్లు నిర్మిస్తామని చెప్పినా ఏ ఒక్కటీ అమలు కాలేదు.

– 500 జనాభా దాటిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. అసలు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించి వాటిని ఉత్సవ విగ్రహాలుగా మలిచేశారు.

–అగ్రి గోల్డ్​ బాధితులకు రూ.1,100 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇంకా పూర్తిగా నెరవేరలేదు.

– వైఎస్సార్​ పెళ్లి కానుక కింద ప్రతి వధువుకు రూ. లక్ష ఇస్తామన్నారు. దీన్ని కొన్నేళ్లపాటు ఆపేసి ఇటీవలనే ప్రారంభించారు. సవాలక్ష నిబంధనలు విధించి లబ్దిదారులను కుదించేశారు.

– ప్రభుత్వ, సహకార రంగంలో మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న హామీని గాలికొదిలేశారు. అమూల్​ను తీసుకొచ్చినా పాడిపై ఆధారపడ్డ కుటుంబాలకు ఒనగూడింది ఏమీలేదు.

– ప్రైవేటు టీచర్ల కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. కనీస వేతనం, ఈఎస్​ఐ వర్తించేలా నిబంధనలు మారుస్తామని హామీ ఇచ్చారు. అది అమలుకు నోచుకోలేదు.

– గ్రానైట్​ పాలిషింగ్​ కు విద్యుత్ యూనిట్ ధర​ రూ.7.35 నుంచి రూ.3.75కు తగ్గిస్తామన్న హామీ నెరవేరలేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్​ ఇస్తామని ఎక్కడ లేని నిబంధనలు విధించడంతో రైతులు వినియోగించుకోలేకపోతున్నారు.

– జర్నలిస్టులకు పింఛను, ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామన్నారు. ఇవి నెరవేర్చకపోగా వాళ్లకిస్తున్న అక్రెడిటేషన్​ కార్డుల మంజూరుకు సవాలక్ష నిబంధనలు విధించి మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed