BREAKING: ఎంపీగా పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

by Satheesh |   ( Updated:2024-03-19 14:24:32.0  )
BREAKING: ఎంపీగా పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును పవన్ ప్రకటించారు. పిఠాపురం అసెంబ్లీ సీటును తన కోసం త్యాగం చేసిన ఉదయ్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనను ఎంపీగా పోటీ చేయమని సూచిస్తే కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని తెలిపారు. అప్పుడు తాను, ఉదయ్ కుమార్ స్థానాలు మార్చుకుంటామని క్లారిటీ ఇచ్చారు.

తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే.. ఉదయ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ రెండు స్థానాలు మాకు ఎంతో కీలకమన్నారు. జనసేన లేకపోతే అసలు పొత్తులే లేవని.. టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాన్ని తానే ఒప్పించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేనను గెలిపిస్తే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తాన్నారు. గెలవడం కాదు.. జనసేన అభ్యర్థులకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. కాకినాడ పార్లమెంట్ దద్దరిల్లాలని అన్నారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఫోకస్ పెట్టారు. అయితే, జనసేనకు కేటాయించిన రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ నుండి జనసేనలోకి చేరిన ఎంపీ బాలశౌరికి ఇప్పటికే పవన్ మచిలీ పట్నం సీటు కేటాయించారు. దీంతో జనసేన పోటీ చేయబోయే మరో స్థానం ఏంటన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇవాళ పవన్ కల్యాణ్ అధికారికంగా కాకినాడ జనసేన అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ పోటీ చేయబోయే పార్లమెంట్ స్థానాలు ఏవి అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.

Read More..

BREAKING: కాకినాడ MP అభ్యర్థిని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

Advertisement

Next Story

Most Viewed