రైతులకు సాగునీరివ్వరు.. కానీ జగన్ కంపెనీలకు మాత్రం జీవోలిచ్చి మరీ తరలింపు: బీజేపీ నేత సత్యకుమార్

by Seetharam |
రైతులకు సాగునీరివ్వరు.. కానీ జగన్ కంపెనీలకు మాత్రం జీవోలిచ్చి మరీ తరలింపు: బీజేపీ నేత సత్యకుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరవు విలయతాండవం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ఆరోపించారు. ఒకవైపు కరవుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కనీసం వారికి సాయం అందించడంలో కూడా జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా విఫలమయ్యారని సత్యకుమార్ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్వర్తి ఫిడేలు వాయించినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా తనకేం పట్టదన్నట్లు తాడేపల్లి ప్యాలెస్‌కే జగన్ పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల్లో పాల్గొని అసత్యాలు, మాయమాటలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు లేవని.. ఏదో కొద్దిగా ఉందని సీఎం వైఎస్ జగన్ చెప్పడం సిగ్గు చేటన్నారు. కరవుతో రైతులు అల్లాడుతుంటే కనీసం జగన్ సమీక్ష సైతం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రమంతటా కరవు ఉన్నా కేవలం 103 మండలాల్లో మాత్రమే కరవుందని సీఎం జగన్ ప్రకటించడం అన్యాయమన్నారు. కరవు వల్ల రాష్ట్రంలో 80 శాతం నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 శాతం మాత్రమే నష్టాన్ని చూపిస్తున్నారని... కరవు సాయం కోసం కేంద్రానికి సీఎం జగన్ కనీసం లేఖ కూడా రాయలేదని సత్యకుమార్ ఎద్దేవా చేశారు.

సొంత కంపెనీలకు నీటి తరలింపు

రైతాంగం కరవుబారినపడి తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం సాయం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. పంటలు ఎండుతున్నా రైతాంగానికి సాగునీరు ఇవ్వని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కానీ తన సొంత కంపెనీలకు మాత్రం జీవోలు ఇచ్చి నిరంతరాయంగా నీరుస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా భారతి సిమెంట్స్‌కు 0.1 టీఎంసీ నీటిని నిరాటంకంగా తరలిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు సీఎం మేనమామ సంస్థ ప్రతిభ బయోటెక్స్‌కు సైతం రోజుకు 500 కెఎల్డీ చొప్పున నీరు ఇస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి ఈ దుస్థితి ఏర్పడిందని సత్యకుమార్ ఆరోపించారు.

పోరాటం చేస్తాం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. కేంద్రం నిధులిస్తున్నా ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారో..ఆ ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే కూడా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై బీజేపీ కార్యాచరణ రూపొందించి పోరాటం చేస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed