విశాఖ వైసీపీలో ఎమ్మెల్సీ లొల్లి.. గుడివాడ వర్సెస్ గురువులు

by srinivas |
విశాఖ వైసీపీలో ఎమ్మెల్సీ లొల్లి.. గుడివాడ వర్సెస్ గురువులు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఘోర ఓటమి నుంచి విశాఖ వైసీపీ ఇంకా కోలుకోకముందే ఎమ్మెల్సీ లొల్లి ఆరంభమైంది. గతంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై జనసేనలోకి మారి విశాఖ దక్షిణ నియోజక వర్గం శాసనసభ్యుడిగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ కారణంగా ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఈ సీటు కోసం అప్పుడే వైసీపీలో పోటీ ప్రారంభమైంది. గతంలో వైసీపీ శాసనసభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగా ఓటమి చెందిన పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు దీనిని ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ కూడా ఆయనకు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే, విచిత్రంగా రాష్ట్రంలో విపరీతమైన వ్యతిరేకతను కూడగట్టుకొని అత్యధికంగా 95 వేల తేడాతో గాజువాక నుంచి దారుణ ఓటమి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కోట్ల రూపాయల ఆఫర్‌తో తెరమీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, విశాఖ స్థానిక సంస్థల్లో 500కు పైగా ఓట్ల స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీ నుంచి పోటీకి దిగితే వారంతా పార్టీ మారి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారన్న భయంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసలు పోటీకే సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది.

గురువులు అలక..

మత్స్యకార వర్గానికి చెందిన కోలా గురువులుకు వైసీపీలో తీరని అన్యాయం జరిగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారని తెలిసి కూడా అటువంటి ఓట్లనే వైసీపీ గురువులుకు కేటాయించింది. ఆ ఎన్నికల్లో గురువులు ఓడిపోయి తెలుగుదేశం పార్టీకి చెందిన అనురాధ విజయం సాధించారు. గురువులను చల్లబర్చేందుకు వెంటనే పార్టీ విశాఖ అధ్యక్ష పదవితో పాటు, ఖాళీగా వున్న డీసీసీబీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించి తీరుతామనే హామీని స్వయంగా జగనే ఇచ్చారు. అనుకోకుండా వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా ద్వారా అవకాశం రాగా భయంతో జగన్ వెనుకడుగు వేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు పోటీలో వైసీపీ వుండదని జగన్ చెప్పడంతో గురువులు మనస్తాపం చెందారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి ఏర్పాట్ల సభకు ఆయన డుమ్మా కొట్టారు.

పానకంలో పుడకలా అమర్నాథ్..

విశాఖ వైసీపీలో అత్యంత వివాదాస్పదుడిగా ముద్రపడి, పార్టీ ఇచ్చిన కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా నొక్కేసి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు తనకు కేటాయించాలంటూ పైరవీలు ప్రారంభించారు. ఈ సీటును గెలుచుకోవాలంటూ క్యాంప్ ఏర్పాటు చేసి రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేయాలని అందుకు తాను సిద్ధమని పార్టీ పెద్దలకు చెప్పారని తెలిసింది. అసలు అమర్నాధ్ ధోరణి, వ్యవహారాల కారణంగానే జిల్లాలో పార్టీ ఇంత ఘోరంగా దెబ్బతిన్నదని ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని పార్టీలోని వ్యతిరేకులు వాదిస్తున్నారు. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వేత్తల నుంచి 20 కోట్ల వరకూ వసూలు చేసి, మాయ మాటలతో జగన్ నుంచి మిగిలిన వారికంటే రెట్టింపు ఫండ్ తెచ్చుకొన్న అమర్ అసలు పంచకుండా, ఖర్చు చేయకుండా దాచుకొని 95 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కాదుకదా, పార్టీలోనూ ఎటువంటి పోస్టు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగుదేశం నుంచి గండి బాబ్జీ..

ఈ సీటును తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి కేటాయిస్తారని తెలిసింది. ఎవ్వరూ లేని సమయంలో పెందుర్తిని వదిలి విశాఖ నగరానికి వచ్చి దక్షిణ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా అద్భుతంగా పనిచేసి పార్టీ అధిష్టానం మెప్పు పొందినప్పటికీ పొత్తు కారణంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. ఆ నియోజక వర్గంలో ఊహించని విధంగా కూటమి అభ్యర్థికి 64 వేల ఓట్ల మెజారిటీ రావడం వెనుక బాబ్జీ వేసిన బేస్ వుందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో బాబ్జీకి జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ టికెట్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వైసీపీ పోటీకి దిగినప్పటికీ స్థానిక సంస్థల ప్రతినిధులు తమతో టచ్‌లో వున్నందున సునాయాసంగానే విజయం సాధిస్తామని కూటమి నేతలు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed