ఇంకా పొంచి ఉన్న ప్రమాదం.. స్కూళ్లకు సెలవు ప్రకటన

by srinivas |
ఇంకా పొంచి ఉన్న ప్రమాదం.. స్కూళ్లకు సెలవు ప్రకటన
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: ఏలేరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో అధికారులు 27వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టటంతో ప్రస్తుతం 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రమాదం ఇంకా పొంచి ఉందని, ఏ సమయంలోనైనా వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వరద ప్రవహిస్తుండటంతో కాకినాడ - కత్తిపూడి హైవే మూసివేసి ట్రాఫిక్‌ను మళ్ళించారు. ప్రత్తిపాడు-సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

స్కూళ్లకు సెలవు..

పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఆదేశాలు జారీ చేశారు. కిర్లంపూడి మండలం వీరవరంలో 15 నుంచి 20 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. రాజుపాలెం గ్రామంలో 15 నుంచి 20 మంది సభ్యులతో కూడిన రెండు ఎల్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో పాల్గొన్నాయి. పిఠాపురం మండలం రాపర్తి గ్రామం వద్ద రాపర్తి బ్రిడ్జి రోడ్డుపై నీరు ప్రవహించడంతో ఇద్దరు వ్యక్తులను రక్షించారు. 120 మంది ఆర్మీ సభ్యులు వచ్చి కాకినాడలో బస చేశారు. బాధిత కుటుంబాలకు పంపిణీ చేయడానికి మొత్తం 5,000 నిత్యావసర వస్తువుల కిట్లు సిద్ధం చేశారు.

Advertisement

Next Story
null