నాడు పవన్‌పై విమర్శలు..నేడు వైసీపీలోకి: జగన్ చెంతకు పసుపులేటి సందీప్, పద్మావతి

by Seetharam |
నాడు పవన్‌పై విమర్శలు..నేడు వైసీపీలోకి: జగన్ చెంతకు పసుపులేటి సందీప్, పద్మావతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైనా పార్టీపైనా తీవ్ర విమర్శలు చేసిన పసుపులేటి సందీప్ రాయల్, పసుపులేటి పద్మావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో పసుపులేటి సందీప్ రాయల్ జనసేనాని పవన్ కల్యాణ్‌కు పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. ఇకపోతే ఆయన తల్లి పసుపులేటి పద్మావతి రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను తట్టుకోలేక బయటకు వచ్చేశారు. అనంతరం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పసుపులేటి సందీప్ రాయల్ అతని తల్లి పసుపులేటి పద్మావతిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి వారికి సూచించారు.

పవన్ కల్యాణ్ నట్టేట ముంచారు: సందీప్

పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే తమలాగే అందర్ని రోడ్డున పడేస్తాడు...నట్టేట ముంచుతాడని పసుపులేటి సందీప్ రాయల్ ఆరోపించారు. అందర్నీ ప్రశ్నిస్తానని రాజకీయాలలో మార్పు తేస్తానని చెప్పే పవన్ కల్యాణ్‌లో నిలకడలేదని అన్నారు. పవన్ కల్యాణ్‌ను నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద తనను, తన తల్లిని పవన్ కళ్యాణ్ రోడ్డుకీడ్చాడు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అహంకారి అని మండిపడ్డారు. మరోవైపు టీడీపీ కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ పంచన చేరి మరోసారి ప్రజలను ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఇకపై వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని అందులో భాగంగానే వైసీపీలో చేరినట్లు పసుపులేటి సందీప్ రాయల్ వెల్లడించారు.

టీడీపీతో జనసేన పొత్తును ప్రజలు అంగీకరించరు: పద్మావతి

2009లో మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యాంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు పసుపులేటి పద్మావతి తెలిపారు. 2014లో జనసేనకు అండగా నిలబడినట్లు స్పష్టం చేశారు. పవన్‌ను నమ్మి, ఆయన చెప్పిన మాటలు విని సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తన బిడ్డను ఆయన దగ్గరకు పంపితే ఈరోజు రోడ్డున పడేసి చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ను నమ్మి యువతను ఎవ్వరూ పవన్ వద్దకు పంపద్దు అని ఒక తల్లిగా తన అనుభవంతో రాష్ట్రంలోని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పవన్ మాట తప్పి తమను బయటకు పంపించేశాడని..నాదెండ్ల మనోహర్ మహిళలను ఎదగనివ్వకుండా తొక్కేస్తాడని ఆరోపించారు. జనసేన పార్టీలో మహిళలకు గౌరవం లేదని అన్నారు. తెలుగుదేశం-జనసేన కలవడాన్ని ప్రజలు ముఖ్యంగా జనసైనికులు ఎవ్వరూ అంగీకరించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. పేద,బడుగు వర్గాలకు ఎన్నో పధకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్ మరోసారి సీఎం కావడం తథ్యమని పసుపులేటి పద్మావతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed