వలంటీర్లపైనే కోటి ఆశలు.. సీఎం జగన్ తీరుతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..!

by Satheesh |   ( Updated:2023-11-17 06:13:06.0  )
వలంటీర్లపైనే కోటి ఆశలు.. సీఎం జగన్ తీరుతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..!
X

నాలుగున్నరేళ్లుగా పార్టీ యంత్రాంగం గురించి వైసీపీ అధిష్టానం అంతగా పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో కేవలం వలంటీర్లు, సచివాలయాలతోనే పాలన సాగింది. ఎమ్మెల్యేల సిఫారసులతో వచ్చిన వలంటీర్లనే అధిష్టానం నమ్ముకుంది. సంక్షేమ పథకాల సారథులు వీళ్లే అయినందున రేపు ఎన్నికల్లో ఓట్లు వేయించగలరనే ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో పనిచేసిన క్షేత్ర స్థాయి నాయకులను పట్టించుకోలేదు. అంతిమంగా పోల్​మేనేజ్​మెంటుతో గట్టెక్కగలమనే విశ్వాసంతో ఉన్నట్లుంది. నిజంగా వలంటీర్లు చెబితే ఓట్లేస్తారా..! సగటు ప్రజల మౌనం ప్రభుత్వానికి అనుకూలమని భావిస్తున్నారా..! పథకాలు విజయతీరాన్ని చేర్చగలవా అనే చర్చ వైసీపీ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. జనంలో గూడు కట్టుకున్న వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారానికి రాగానే ప్రతి 70 కుటుంబాలకు ఓ వలంటీరును నియమించింది. ఆయా కుటుంబాల నివాసాలకు దగ్గరగా ఉన్న పార్టీ కార్యకర్తలనే వలంటీర్లుగా ఎంపిక చేశారు. సంక్షేమ పథకాల నుంచి అనేక ధ్రువ పత్రాల జారీ దాకా సేవలందిస్తూ వలంటీర్లు ప్రజల మన్ననలు పొందారు. సీఎం సభలు, పార్టీ బహిరంగ సభలకు రావాలని లబ్దిదారులపై ఒత్తిడి తేవడంతో వాళ్లతో ప్రజలకున్న సంబంధాల్లో తేడా కొడుతోంది. రేపు ఓట్లేయాలని వలంటీర్లు చెబితే ప్రజలు వింటారా..! రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. రాజకీయ నాయకుల ఒత్తిడులుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి వలంటీర్లు చెప్పినట్లు వింటారా అంటే సాధ్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

మౌనం అందుకేనా..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రజలపై నిఘా పెరిగింది. ఎవరు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారనే సమాచారాన్ని వలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారు. దీంతో చాలా మంది పథకాల లబ్దిదారులు బయటపడడం లేదు. ఈ మౌనం ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్లు అధికార పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందువల్లే సీఎం 175కు 175 సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. గతం కన్నా భిన్నంగా వాయిదాల పద్దతిలో నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నందున లబ్దిదారులు నోరు మెదపడం లేదు. వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరించినా పథకాలు కట్​చేస్తారనే ఆందోళన వల్లే మౌనం వహిస్తున్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది.

క్యాడర్‌పై నిర్లక్ష్యం..

ఇప్పుడు కులాలవారీ కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాలకు నాయకులుగా పాలకవర్గాలను ముందుకు తెచ్చారు. చైర్మన్లు, డైరెక్టర్లను తమ నేతలుగా ఆయా సామాజిక వర్గాల ప్రజలు విశ్వసించడం లేదు. ఉత్తుత్తి కార్పొరేషన్లతో తమకు ఒరిగిందేంటని అక్కడక్కడా వాళ్లను నిలదీస్తున్న సందర్భాలున్నాయి. సంప్రదాయంగా క్షేత్ర స్థాయిలో పనిచేసిన పార్టీ క్యాడర్‌ను అధికారానికి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు.

ఎమ్మెల్యేల్లో టెన్షన్..

కేవలం వలంటీర్లను నమ్ముకొని ఎన్నికల్లో గెలవగలమా అనే ఆందోళన ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల్లో నెలకొంది. ఇటీవల గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లుగా కొంత క్యాడర్‌ను దగ్గరకు తీసినా వాళ్లు ఓటర్లను ప్రభావితం చేయగలరా అనే సందేహాలు నెలకొన్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని రైలు పట్టాల మాదిరి సమాంతరంగా నడపలేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమేరకు ఉందనేది ఎన్నికల్లో మాత్రమే ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed