Tirumala: భక్తులకు దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేది అక్కడే..!

by srinivas |
Tirumala: భక్తులకు దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేది అక్కడే..!
X

దిశ, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

దివ్య దర్శనానికి ఆ మార్గమే..

భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శనం టోకెన్ల పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని, అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారని వెల్లడించారు.

ఈ సత్రాల్లో సర్వదర్శనం టికెట్లు

అయితే వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారని, భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని కోరారు.

భారీగా భక్తుల రద్దీ

కాగా వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనాలకు చాలా సమయం పడుతోంది. క్యూలైన్లన్నీ నిండిపోయి భక్తులు బయట కూడా వేచి చూస్తున్నారు. గంటలకొద్ది నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Next Story

Most Viewed