ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

by Seetharam |   ( Updated:2023-12-21 10:21:17.0  )
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నంకు తరలించాలన్న ఏపీ ప్రభుత్వం ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ఇప్పటికే ఈ అంశంపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో అమలులో ఉంటుందని తెలిపింది.దీంతో ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రధాన కార్యాలయాల తరలింపు మరింత ఆలస్యం కానుంది.

35 కార్యాలయాల తరలింపునకు యత్నం

ఇకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ప్రకటించారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ ప్రారంభించాలని భావించారు.ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం క్యాపు కార్యాలయంతోపాటు అధికారిక నివాసాన్ని సైతం సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బిల్డింగ్‌లను సైతం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం అధికారుల కమిటీని సైతం నియమించింది. ఈ అధికారుల కమిటీ కార్యాలయాలను ఎంపిక చేసి అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టాయి.

విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తారనే సమాచారంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అమరావతి రాజధానిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికిప్పుడు తరలిస్తున్నారా లేక ఎప్పుడు తరలిస్తున్నారని ఏజీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అయితే ఏజీ స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో విచారణను వాయిదా వేశారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ఏజీ జడ్జి ఎదుట ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్‌ను కూడా త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని ఆదేశించారు. అయితే తాను పంపలేనని, రోస్టర్ ప్రకారం తన ముందు వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపి ఆదేశాలు ఇస్తానని జడ్జి వెల్లడించారు. దీంతో సీజే వద్ద ఈ వ్యవహారం ప్రస్తావించారు. దీంతో పిటిషన్‌ త్రిసభ్య బెంచ్ కు సీజే బదిలీ చేసింది. ఈ పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం విచారించి తీర్పు వెల్లడించనుంది. అప్పటి వరకు స్టేటస్ కో అమలులో ఉండనుంది.

Advertisement

Next Story