AP News: వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News: వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి,అనంతపురం:పేదలకు మూడు పూటలా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తన అహకారంతో జగన్ రెడ్డి మూసివేయించారని..ఆ పాపం ఖచ్చితంగా అనుభవిస్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని బళ్లారి బైపాస్ లో గల అన్న క్యాంటీన్ ను సోమవారం ఆయన పరిశీలించారు. 2019 నుంచి అన్న క్యాంటీన్లు మూసి వేసిన నేపథ్యంలో అవి అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరమ్మత్తులు చేయించి..వాటిని పూర్వ స్థితికి తీసుకు వచ్చారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వాటిని పరిశీలించారు. క్యాంటీన్ లో ఫర్నీచర్, తాగునీరు, వంట గది పరిశీలించారు. ఎక్కడ చిన్న లోటు పాట్లు కూడా కనిపించకూడదని అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు. పేదలకు భోజనం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సేవా భావంతో చూడాలన్నారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ..పట్టణ ప్రాంతాలకు పని కోసం వచ్చే కార్మికులు ఇతర వర్గాల వారు హోటళ్లలో తినాలంటే డబ్బు వెచ్చించలేక అర్ధాకలితో ఉండేవారన్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అన్న క్యాంటీన్లను తీసుకొచ్చారన్నారు. కానీ, వాటి వల్ల చంద్రబాబుకు మంచి పేరు వస్తోందన్న ఉద్దేశం తో వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మూసివేయించిన పేదల నోటి వద్ద ముద్ద లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మూడు క్యాంటీన్లను 30 లక్షలతో మరమ్మతులు చేయించినట్టు వివరించారు. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వాటిని ఓపెన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ హరిబాబు, మున్సిపల్ ఈఈ సూర్య నారాయణ, ఏఈ శంకర్, టీడీపీ నేతలు రాయల్ మురళి, గంగారామ్, డిష్ నాగరాజు, దళవాయి వెంకట నారాయణ, తెలుగు మహిళ నాయకురాళ్లు సంగా తేజస్విని, వడ్డే భవాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed