విశాఖకు పరిపాలన రాజధాని : 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయింపు

by Seetharam |   ( Updated:2023-11-23 12:01:16.0  )
విశాఖకు పరిపాలన రాజధాని : 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ పరిపాలన రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. విశాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరలో రాజధానిని విశాఖకు తరలిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఉండేందుకు నివాసంతోపాటు క్యాంపు కార్యాలయాల ఎంపిక సైతం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


మిలినియం టవర్స్‌లో అత్యధిక స్పేస్

ఇకపోతే రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించింది. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కమిటీ నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని స్పష్టం చేశారు. ఇక వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను కమిటీ గుర్తించింది. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కమిటీ గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed