ప్రజలను అరాచకం వైపు తీసుకెళ్తున్నారు: అమిత్ షా

by Shamantha N |
amith sha and mamatha
X

కోల్‌కతా : కేంద్ర బలగాలను ఉద్దేశించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రజలను అరాచకం వైపునకు నెడుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)ను ఘెరావ్ చేయండని దీదీ ప్రజలకు పిలుపునివ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రిని తన జీవితంలో మునుపెన్నడూ చూడలేదని షా అన్నారు. సీఏపీఎఫ్ బలగాలు ఎన్నికల డ్యూటీ కోసం నియమిస్తే అది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, వారితో హోంశాఖకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే టీఎంసీకి ఓడిపోతామనే ఆందోళన పెరిగిందని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఇంతకాలం టీఎంసీకి మద్దతుగా ఉన్న మైనారిటీ ఓట్లు కూడా దూరమవుతున్నాయని తెలిపారు.

ఎన్నికల్లో గెలిచాక ‘ఏబీపీ’ మావైపే..

దీదీ అడ్డా భవానీపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బెంగాల్‌లో ఏబీపీ న్యూస్ ఛానెల్ ప్రస్తుతం టీఎంసీకి అనుకూలంగా ఉన్నదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే తమ వైపునకు రావడం ఖాయమని వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Next Story