లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీతో బీచ్‌లో ఆరోగ్య మంత్రి

by vinod kumar |
లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీతో బీచ్‌లో ఆరోగ్య మంత్రి
X

వెల్లింగ్టన్ : ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతోంది. దాని కట్టడి కోసం ఇతర దేశాల్లాగే.. న్యూజీలాండ్‌లో కూడా గత నెల 25 నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలవుతున్నది. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ప్రధాని జెసిండా అర్డెన్ సూచించారు. కాని అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆరోగ్య మంత్రి డేవిడ్ క్లార్క్ మాత్రం బీచ్‌లో షికార్లు కొట్టారు. దీంతో అతనిపై విమర్శలు గుప్పుమన్నాయి. దేశంలో కరోనా వ్యాపిస్తున్న సమయం, ఒక ఆరోగ్య మంత్రిగా ఆయనే ముందుండి నడిపించాల్సిన పరిస్థితి.. కాని, అందుకు విరుద్ధంగా గత వారాంతంలో తన ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్స్ పాయింట్ బీచ్‌కు తన ఫ్యామిలీతో సహా కారులో వెళ్లారు. అక్కడే సరదాగా గడిపి తిరిగి ఇంటికి వచ్చారు. ఈ విషయం కాస్తా ప్రధాని జెసిండాకు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డేవిడ్ క్లార్క్ తన మంత్రి పదవికి రాజీనామా లేఖను ప్రధానికి అందించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే క్లార్క్‌ను నేనే తొలగించేదానిని కాని ప్రస్తుతం కరోనాపై పోరాడుతున్న క్లిష్టసమయంలో అతని సేవలు అవసరం కాబట్టి కొనసాగిస్తున్నామని ప్రధాని జెసిండా తెలిపారు. అయితే, క్లార్క్ తన కేబినెట్ ర్యాంకును కోల్పోయారు. అంతే కాకుండా అసోసియేష్ ఫైనాన్స్ మినిస్టర్ పదవిని కూడా తొలగించారు. మంత్రి క్లార్క్ స్పందిస్తూ.. ‘నేనొక ఈడియట్‌ని… ప్రజలందరికీ మార్గదర్శిగా ఉండాల్సిన వాడిని ఇలా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాను. దీనికి ప్రజలు నాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుసు కానీ.. నన్ను క్షమించండి’ అని అన్నారు.

కాగా ఇప్పటి వరకు న్యూజీలాండ్‌లో 1,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకరు (70 ఏండ్ల మహిళ) మృతి చెందారు.

Tags: New Zealand, health Minister, david clarke, beach, pandemic, lockdown

Advertisement

Next Story

Most Viewed