జగన్ పాలనపై సినీనటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
Suman
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పనితీరుపై సినీనటుడు సుమన్ హర్షం వ్యక్తం చేశారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. గుంటూరు జిల్లాలోని నిర్మల హృదయ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగులు, పేదలకు పండ్లు , స్వీట్స్, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ…

గతంలో తాను కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరుకూ అందరి సీఎంల పనితీరును పరిశీలించానని అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎవరూ అమలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. తండ్రికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా సంక్షేమపథకాలు అందజేస్తున్న సీఎం జగన్ కుటుంబానికి ఆ దేవుడి, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి మేకతోటి సుచరిత ఆకాంక్షించారు.

Advertisement

Next Story