హైదరాబాద్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే

by Harish |
హైదరాబాద్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నోను చిత్తుగా ఓడించింది. లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 9.4 ఓవర్లలోనే హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పలు రికార్డులు నెలకొల్పింది. అవేంటో చూద్దాం..

ఐపీఎల్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు కూడా ఈ రికార్డు హైదరాబాద్ పేరిటే ఉంది. ఈ సీజన్‌లో ఢిల్లీపై 158/4 స్కోరు చేయగా.. ఈ మ్యాచ్‌లో 167/0 స్కోరు చేసి తన రికార్డును తానే బద్దలుకొట్టింది.

10 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్ మరో రికార్డు కూడా నెలకొల్పింది. ఐపీఎల్‌లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే 100+ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఘనత సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలి ఉండగానే ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి చేసింది. గతంలో 2022లో పంజాబ్‌పై ఢిల్లీ 57 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ఐపీఎల్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు 146 సిక్స్‌లు కొట్టింది. 2018లో చెన్నయ్ 145 సిక్స్‌లు కొట్టగా.. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అభిషేక్ శర్మ 35 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్(32) రెండో స్థానంలో ఉండగా.. హెడ్(32), క్లాసెన్(31) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

Advertisement

Next Story