ఆ మూడు జట్ల మధ్యే ప్లే ఆఫ్స్ పోటీ

by Harish |
ఆ మూడు జట్ల మధ్యే ప్లే ఆఫ్స్ పోటీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 లీగ్ దశ ముగింపునకు వచ్చింది. తొలి రౌండ్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు సాధించాయి. ఇక, మిగిలినవి రెండే స్థానాలు. వీటి కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు జట్ల మధ్యే పోటీ నెలకొంది. లక్నో, ఢిల్లీ జట్లకు అవకాశాలు ఉన్నా.. ముందడుగు వేయడం కష్టమే. మరి, ప్లే ఆఫ్స్‌కు చెరే రెండు జట్లేవో?

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ఐదు జట్లలో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎక్కువ ఉన్న టీమ్ హైదరాబాద్. ఎస్‌ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలు సాధించింది. 14 పాయింట్లు, నెట్‌రన్‌రేట్ +0.406తో 4వ స్థానంలో ఉన్నది. హైదరాబాద్‌‌కు మరో రెండు మ్యాచ్‌లు ఉండగా.. అందులో ఒక్కటి గెలిచినా నాకౌట్ బెర్త్ దక్కుతుంది. నేడు గుజరాత్‌తో, 19న పంజాబ్‌తో ఆడనుంది. రెండింటా గెలిస్తే క్వాలిఫయర్-1కు కూడా పోటీ పడొచ్చు. ఒకవేళ రెండూ ఓడినా అవకాశాలు ఉంటాయి. అయితే, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, చెన్నయ్‌లతో పోలిస్తే మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉండాలి.

చెన్నయ్ సూపర్ కింగ్స్ : హైదరాబాద్ తర్వాత ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్టు డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 14 పాయింట్లతో ఆ జట్టు మూడో స్థానంలో ఉన్నది. ఈ నెల 18న బెంగళూరుపై గెలిస్తే సీఎస్కే నేరుగా తర్వాతి రౌండ్‌కు చేరుకుంటుంది. ఒక వేళ ఓడినా తక్కువ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో(చివరి మ్యాచ్‌లో నెగ్గితే)‌, హైదరాబాద్(రెండు మ్యాచ్‌ల్లో ఓడితే)లతో కలిసి 14 పాయింట్లతో నిలిచినప్పటికీ.. మెరుగైన నెట్‌రేట్‌తో ముందడుగు వేయొచ్చు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఒక్కటే దారి ఉంది. ఈ నెల 18న చెన్నయ్‌పై గెలవాలి. గెలిస్తేనే సరిపోదు. 18 పరుగుల తేడాతో లేదా లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదిస్తేనే సీఎస్కే కంటే మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ఆర్సీబీకి నాకౌట్ బెర్త్ దక్కతుంది.

లక్నో, ఢిల్లీకి కష్టమే

ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ సాంకేతికంగానే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. అద్భుతం జరిగితే తప్ప ఆ రెండు జట్లు ముందడుగు వేయలేవు. హైదరాబాద్, చెన్నయ్ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో నెగ్గితే ఢిల్లీ, లక్నో ఆశలు గల్లంతైనట్టే. ఢిల్లీ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో 6వ స్థానంలో, లక్నో 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తవ్వగా.. లక్నో ఈ నెల 17న ముంబైతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఓడితే నిష్ర్కమించినట్టే. ఒకవేళ గెలిస్తే 14 పాయింట్లతో పోటీలో ఉంటుంది. అయితే, ఢిల్లీ, లక్నో నెట్‌రన్‌రేట్ చాలా తక్కువగా ఉండటంతో ఆ రెండు జట్లు ముందడుగు వేయడం కష్టమే.

Advertisement

Next Story