భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే మాజీ సర్పంచ్ హత్య

by Sridhar Babu |
భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే మాజీ సర్పంచ్ హత్య
X

దిశ, వర్దన్నపేట : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్యను పోలీసులు ఛేదించారు. కాంగ్రెస్ నాయకుడు పల్లె మల్లేష్, అతని కుమారుడు మురళి, మరికొంత మంది కలిసి దేవేందర్ ను హతమార్చా రని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ అంబటి నర్సయ్యలు పత్రికా సమావేశం నిర్వహించి నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ దేవేందర్ హత్యకు భూతగాదాలే కారణమన్నారు. బురాన్ పల్లి గ్రామ శివారులోని 3 ఎకరాల భూమి విషయంలో దేవేందర్, మల్లేష్ మధ్య తగాదాలు వచ్చాయన్నారు.

2022లో మల్లేష్ పై హత్యాయత్నం జరగ్గా దేవేందర్, మరికొందరిపై రాయపర్తి పోలీస్ స్టే షన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా తనను హతమార్చడానికి దేవేందర్ ప్రయత్నిస్తున్నాడని అనుమానించిన మల్లేష్ అతని అడ్డుతొలగించుకో వాలని నిర్ణయించుకున్నాడన్నారు. ఈ క్రమంలో జూలై 7వ తేదీన మల్లేష్, అతని కొడుకు మురళి, చెన్నరాయుడు, మరికొందరు కలిసి దేవేందర్ ఇంటికి వెళ్లి హ్యామర్ తో అతన్ని కొట్టి చంపారన్నారు. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తుండడంతో అందులో ముగ్గురు (పల్లె మల్లేషం, చెన్నరాయుడు. గోవింద్) మంగళవారం వర్ధన్నపేటలో డీసీపీ ముందు లొంగిపోయారు. ఈ కేసులో A1 నిందితుడు పల్లె మురళి, మిగిలిన నిందితుల కోసం 3 బృందాలతో గాలిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సూర్య ప్రకాష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed