అరెస్టు భయంతోనే పారిపోయా.. ఎట్టకేలకు నోరువిప్పిన పుట్టా మధు

by Sridhar Babu |
అరెస్టు భయంతోనే పారిపోయా.. ఎట్టకేలకు నోరువిప్పిన పుట్టా మధు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో లాయర్ గట్టు వామన్ రావు దంపతుల హత్య రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టామధును పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకోసం పుట్టా మధు గెస్ట్‌హౌస్‌కు వెళ్ళగా గన్ మెన్లు, డ్రైవర్‌కు చెప్పకుండానే అతను కనిపించకుండా పోయాడు. చివరగా పుట్టా మధును రామగుండం కమిషనరేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు నిజాలు వెలుగుచూశాయి.

కనిపించకుండా పోయిన 10 రోజుల్లో తాను ఎక్కడెక్కడికీ వెళ్లిందనే విషయాలను జడ్పీ చైర్మన్ పోలీసుల ఎదుట వెల్లడించారు. లాయర్ దంపతుల హత్యకేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తారోననే భయంతోనే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు మధు అంగీకరించినట్లు తెలుస్తోంది. తొలుత మహారాష్ట్రకు వెళ్లి అక్కడ రెండ్రోజులు ఉండి ఆ తర్వాత ఛత్తీస్ గఢ్‌కు, అక్కడి నుంచి ఒడిశా మీదుగా తిరిగి ఏపీలోని భీమవరంలోని చేపల చెరువుల వద్ద తలదాచుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం పుట్టా మధు విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story