రుణ మాఫీ రైతులందరికీ చేస్తే ముక్కు నేలకు రాస్తా..! : హరీష్ రావు

by Kalyani |
రుణ మాఫీ రైతులందరికీ చేస్తే ముక్కు నేలకు రాస్తా..! : హరీష్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి : రుణమాఫీ చేసినట్లు అసెంబ్లీలో తప్పుడు మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మెతుకు సీమలో నీ ఇష్టం వచ్చిన గ్రామంలో రైతులతో చెప్పిస్తే ముక్కు నేలకు రాస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేశారు. ఒక వేళ రైతులతో చెప్పించకుంటే అక్కడే సీఎం ముక్కు నేలకు రాసి తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ చర్చిని హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి లు కలిసి సందర్శించారు. అనంతరం బీ అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ… మెతుకు సీమ గడ్డ పై ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దుర్గామాత, చర్చిల పై ఒట్టేసి ఆగస్టు 15 వరకు రెండు లక్షల రుణ మాజీ చేస్తానని ఓటేసిన వీడియోలు చూపించారు. డిసెంబర్ వస్తున్న ఇంకా రైతు రుణ మాఫీ కాలేదని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాత్రం రుణ మాఫీ పూర్తి చేసినట్టు పచ్చి అబద్ధాలు చెప్పాడని విమర్శించారు. ఈ నెల 25 మెదక్ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసినట్లు ఏ ఒక్క గ్రామంలో రైతులతో చెప్పిస్తే అక్కడే ముక్కు నేలకు రాస్తానని, రుణ మాఫీ కాలేదని రైతులు చెబితే సీఎం ముక్కు నేలకు రాయాలని ఛాలెంజ్ చేశారు.

గన్ మెన్ లు లేకుండా ఇద్దరమే వెళ్దామని చెప్పారు. ముందుగా రుణ మాఫీ రూ.49 వేల కోట్లు చెప్పి, కేవలం రూ. 12 కోట్లు చేతిలో పెట్టి దేవుళ్ళ పై వేసిన ప్రమాణాలు తప్పదని తెలిపారు. మెదక్ వస్తున్న సీఎం దుర్గామాత, చర్చిలో తప్పు ఒప్పుకొని ప్రాయచిత్తం చేసుకోవాలని హితవు చెప్పారు. మహిమాన్విత దేవుళ్ళ పై ఒట్టు మంచిది కాదని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ గిఫ్ట్ లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని చెప్పారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా అదుపులో లేవన్నారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో 41 శాతం క్రైమ్ రేటు పెరగడమే ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో 25 వేల కేసులు ఉంటే కాంగ్రెస్ పాలనలో 35 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలో 9 మతకలహాలు జరిగాయని, అరు పాలనలో ఇటు హోం లో ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అరు గ్యారంటీ ల పై ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆనేకే బాద్ లు చేసిందని, బతుకమ్మ కా తోఫా బంద్ హోగయా, రంజాన్ కా తోఫా బంద్ హోగయా, క్రిస్మస్ కాబీ తోఫా బంద్ హోగయా ఇలా అన్నింటిని బంద్ చేస్తూ వస్తుందని అన్నారు. సీఎం స్థానంలో ఉండి పేగులు మెడలేసుకుంటా, చీరుతా, సంపుతా, గోటీలాడుకుంటా, లాగుల తొండలు సొర్రగొడుత.. గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? అని ప్రశ్నించారు. సర్వశిక్ష అభియాన్ వాళ్లు రోడ్డు మీద ధర్నా చేస్తున్న మీకు మాటిచ్చిన, ఏడాదికో, ఆర్నెళ్లకో, మూడు నెలలకో చేస్తా అని చెప్పి వారిని ఓదార్చడం లేదన్నారు. అడిగిన వాళ్లను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్లమీద పగబట్టుడు.. ఇదీ ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నదన్నారు. అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానం లేదు. రేవంత్ అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడుతున్నాడన్నారు.

మీ ప్రభుత్వం పాలసీలు ఏవి అని అడిగితే, పోలీసు వాళ్లను ఇంటికి పంపుతారని, చివరికి ఎందాక వచ్చిందటే.. పోలీసులు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగే వరకు వచ్చిందని అన్నారు. ఎంతసేపూ ప్రతిపక్షాల మీద, వారిని అణచివేయడం మీద, అక్రమ కేసులు పెట్టడంలో కాంగ్రెస్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏడాది కాలంలో 1 లక్షా 27 వేల కోట్ల అప్పులు చేసి బడా కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు తీసుకొని బిల్లులిచ్చించడని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేండ్లలో 4 లక్షల 17 వేల కోట్లు చేస్తే, నువ్వు ఒక్క ఏడాదిలోనే 1 లక్షా 27 వేల కోట్ల అప్పు చేశాడని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదు, రైతుబంధు బందు చేసినవు, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినవు, బతుకమ్మ చీరలు బంద్ చేసినావు ఇంత అప్పు ఎందుకు చేశావో చెప్పాలన్నారు. వాస్తవాలు చెబితే, మేం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీని బుల్డోజ్ చేస్తున్నడన్నారు.

రైతు భరోసా ఎంత ఇస్తవో, ఎన్ని ఎకరాలకు ఇస్తవో, ఎప్పుడిస్తవో ఏమీ చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పై కేసీఆర్ ముందే చెప్పిండని, వారు అధికరంలోని వస్తే రైతుబంధు బంద్ ఆపుతుందని, అప్పుడేమో అట్లా బందు పెట్ట, రైతుబంధు ఇస్త, నేనేమన్నా దివానా గాన్నా అన్నడని, ఇప్పుడు ఎవరు దివానా గాడో ప్రజలే చెప్పాలన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా తిండిపెట్టే రైతులకు తొండి చేసి, పైసలు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నడని, రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ రైతుబంధును ప్రారంభిస్తే, రైతుబంధును బొందపెట్టిండన్నారు. రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ మంత్రులు, నాయకులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో చేసిన హామీల వీడియో లను మీడియాకు చూపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కంటా రెడ్డి తిరుపతి రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, చంద్ర గౌడ్, బట్టి జగపతి, మ్యామిడ్ల ఆంజనేయులు, హరి కృష్ణ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story