ఏపీ బంద్ కి వైసీపీ మద్దతు.. ఆర్టీసీ కీలక నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-03-04 05:13:59.0  )
ఏపీ బంద్ కి వైసీపీ మద్దతు.. ఆర్టీసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. సుదీర్ఘకాలం ప్రతి తెలుగువాడు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

రేపటి రాష్ట్ర బంద్ నేపథ్యంలో.. ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోకుండా, ఆర్టీసీ బస్సుల్ని రేపు మధ్యాహ్నం 1 గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులు తిరిగేలా సహకరించాలని కోరింది. ఆర్టీసీ సోదరులు బ్లాక్ బ్యాడ్జీలతో మధ్యాహ్నం విధులకు హాజరు కావడం ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని ఉక్కు కర్మాగారం పోరాటంపై మాట్లాడారు.

తెలుగు వాళ్ళ పోరాట ఫలితం విశాఖ ఉక్కు అన్న ఆయన అనేక పోరాటాలతో..32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని పేర్ని నాని తెలిపారు. వ్యాపారం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ, ప్రతి వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే.. ధరలు నియంత్రించడం కష్టమయ్యే పని అని అభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రజలకు అవసరమైనవి కొన్ని కచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేవు అన్న పరిస్థితుల్లో మాత్రమే ప్రైవేటీకరణకు వెళ్ళాలని అంతేగానీ ప్రతిదీ ప్రైవేటుపరం చేయడం కరెక్టు కాదని హితవు పలికారు.

విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో ఉంటే..దాని నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సీఎం జగన్ చూపించారని గుర్తు చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రైవేటీకరణ కాకుండా, ఒక కార్పొరేషన్ ను ప్రభుత్వ సంస్థగా, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆర్టీసీని బతికించాలని, ప్రైవేటు వ్యక్తుల దోపిడీని అరికట్టి, సామాన్యులకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి, ప్రభుత్వంపైన అదనంగా రూ. 3600 కోట్ల జీతభత్యాల భారం పడుతున్నా, ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉండాలనే దానిని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు స్పష్టం చేశారు.

అలాగే విశాఖ ఉక్కును కూడా ప్రజల ఆస్తిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నదే తమ ప్రభుత్వ నినాదమన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశంపై సెటైర్లు వేశారు. జల్సాల కోసం, షోకుల కోసం, పిప్పి పన్ను పీకించుకోవడం కోసం అప్పులు చేసిన టీడీపీ నేతలు తమకు సుద్దులు చెప్పటం శోచనీయమన్నారు. తమ ప్రభుత్వం పన్నులు వేసే ప్రభుత్వం కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Advertisement

Next Story