బంగ్లా టూ మహారాష్ట్ర.. యువకుడి కంత్రీ పని

by Sridhar Babu |
బంగ్లా టూ మహారాష్ట్ర.. యువకుడి కంత్రీ పని
X

దిశ, ఖమ్మం: ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో భారీ గంజాయి నిల్వ‌ల‌ను శుక్ర‌వారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసానికి స‌మీపంలో పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్ట‌ర్ కింది భాగంలోని ఓ పెట్టెలో దాదాపు రూ.44 ల‌క్ష‌ల విలువ చేసే 440కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు అడిషనల్ డీసీపీ మురళీధర్ తెలిపారు.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం… మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన రవీంద్ర నాయక్, అదే జిల్లాకు చెందిన ఇస్లావత్ శంకర్‌తో క‌లిసి కొద్దికాలంగా గంజాయి ర‌వాణాకు పాల్ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌వీంద్ర‌నాయ‌క్, శంక‌ర్ ఇటీవ‌ల ఒడిషా నుంచి భారీ మొత్తంలో ఎండు గంజాయిని పట్టణానికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన గంజాయిని మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించే క్ర‌మంలో ర‌వీంద్ర‌నాయ‌క్ నివాసం ఉంటున్న‌ శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్‌కు స‌మీపంలోని పార్కింగ్ చేసి ఉన్న ట్రాక్ట‌ర్ కింది భాగంలో భ‌ద్ర‌ప‌ర్చారు. అయితే ఈ విష‌యం టాస్క్‌ఫోర్స్ పోలీసుల‌కు తెలియ‌డంతో శుక్ర‌వారం ఆక‌స్మికంగా దాడులు నిర్వ‌హించి స‌రుకును స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న 440 కిలోల‌ గంజాయి విలువ దాదాపు రూ.44ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంక‌ట్రావ్ తెలిపారు. ట్రాక్టర్, గంజాయిని సీజ్ చేసి, పంచనామ చేసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రధాన నిందుతుడు శంకర్ నాయక్‌కు మరిపెడ బంగ్లాకు చెందిన బాద‌వ‌త్ సాన్య అనే యువకుడు సహకరించిన‌ట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న శంకర్ నాయక్, రవీందర్ నాయక్‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు, ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ దాడిలో సత్తుపల్లి సీఐ రామకాంత్, సీఐ వెంకన్న, ఇత‌ర సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story