Maoist : తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ రావు అరెస్ట్

by Hajipasha |
Maoist : తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ రావు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.25 లక్షల రివార్డును కలిగి ఉన్న తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నేత(Maoist) 57 ఏళ్ల ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణ్ రావు(Prabhakar Rao)ను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా అంతఘర్ పట్టణంలో ఆదివారం రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలోని బీర్పూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు 1984 సంవత్సరంలో మావోయిస్టులలో చేరారు. ఆయన ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్, కోయ్లీ బేడ, మాన్‌పూర్ మొహ్లా ఏరియాలలో మావోయిస్టు కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం మావోయిస్టులకు చెందిన నార్త్ సబ్ జోనల్ బ్యూరోలో లాజిస్టిక్ సప్లై టీమ్ ఇంఛార్జిగా ప్రభాకర్ పనిచేస్తున్నారు. మావోయిస్టుల మొబైల్ పొలిటికల్ స్కూల్‌ టీమ్‌లో, అర్బన్ నెట్‌వర్క్‌ టీమ్‌లోనూ సభ్యులుగా ఉన్నారు. 2005 నుంచి 2007 వరకు మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యులుగా ప్రభాకర్ రావు వ్యవహరించారు. చాలా రాష్ట్రాల్లో ఆయనపై డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లోని టాప్ మావోయిస్టు నేతలకు సన్నిహితుడిగా ప్రభాకర్‌కు పేరుంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీ గణపతికి ఈయన సమీప బంధువు కూడా.

Advertisement

Next Story

Most Viewed