- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు అడుగులు
ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా వ్యవసాయ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. జీవితంలో ఉన్నతంగా సెటిల్ కావాలని యువకులు పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. చదువుకున్నవాళ్లు ఉద్యోగాల్లో స్థిరపడుతుండగా.. చదువుకోని వాళ్లు కూలీ పనులు చేసుకుంటున్నారు. కానీ, సిరిసిల్ల జిల్లా నుంచి ఇతర పట్టణాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన యువకులు.. మళ్లీ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఉద్యోగాలు వదిలి.. వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు ల్యాప్‌టాప్‌లు పట్టుకుని తిరిగిన వాళ్లు.. ప్రస్తుతం పార చేతబట్టి పొలాల్లో తిరుగుతున్నారు.
దిశ, సిరిసిల్ల: ఈసారి భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు సన్నవడ్లను కొనేవారు లేక ఆగమవుతున్నారు. మసక బారుతున్న వ్యవసాయ రంగానికి మేముసైతం అంటూ యువకులు నాగలి పట్టారు. ప్రైవేట్ కంపెనీల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడిని, పని సమయాన్ని వ్యవసాయంపై పెడితే ఎక్కువగా సంపాదించవచ్చునని యువకులు భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ ఉద్యోగాలను వదిలి అగ్రికల్చర్ డెవలపింగ్ దిశగా అడుగులు వేస్తున్నారు. తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పంటలు సాగుపై ఉపయోగిస్తున్నారు. కరోనా కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో కొందరు ఉద్యోగం చేసుకుంటూనే పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు.
వ్యవసాయమే కాకుండా..
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా దృష్టి పెడుతున్నారు యువకులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఆవులు, గేదెలు, బాయిలర్ కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం వైపు అడుగులు వేస్తున్నారు. తాము ఒకరి దగ్గర పని చేయడం కంటే.. తామే పది మందికి ఉపాధి చూపే అవకాశం ఉంటుందని పలువురు యువకులు చెప్తున్నారు.
సాగుపై మక్కువ..
పట్టణాల్లో ఉద్యోగాలను, మంచి వేతనాన్ని వదిలి సాగుపై మక్కువతో తిరిగి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. తాము చేసే ఉద్యోగాల కన్నా సొంత గ్రామంలో సాగు చేసుకోవడంలోనే సంతృప్తి లభిస్తుందని యువకులు పేర్కొంటున్నారు. పాడిపరిశ్రమ మూలాల్లోకి ప్రవేశించి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తూ భవిష్యత్‌కు భరోసానిస్తున్నారు.
వ్యవసాయాన్ని అప్‌గ్రేడ్ చేస్తా..
ప్రస్తుతం వ్యవసాయ విధానాన్ని అప్‌గ్రేడ్ చేయాలన్నదే నా కోరిక. నేను ఇంజినీరింగ్ పూర్తి చేసి.. బెంగుళూరు ఐబీమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించా. కానీ ఉద్యోగంలో సంతృప్తిలేదు. వ్యవసాయంపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఊళ్లో మాకున్న 6 ఎకరాల్లో వరి, కూరగాయలు సాగు చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే వ్యవసాయంతోనే ఎక్కువ సంతృప్తిగా ఉన్నాను. వ్యవసాయ పరికరాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నాయి. అలాగే అగ్రికల్చర్‌లో కూడా కొత్త పద్ధతులు రావాలి..
-బుర్ర వెంకటేశ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ముష్టిపల్లి
ప్రైవేట్ ఉద్యోగం నచ్చలే..
బీటెక్ తర్వాత రెండేళ్ల వరకు ప్రైవేటు ఉద్యోగాలు చేశాను. సంతృప్తి అనిపించక జాబ్‌కు రిజైన్ చేశాను. సొంత ఊరిలో ఉన్న 5 ఎకరాల భూమితో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తితో పాటు టమాట, మిర్చి, వంకాయ, దోసకాయ వంటి కూరగాయలు సాగు చేస్తున్నా. ఈ జనరేషన్ రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. వ్యవసాయ యంత్రాలను అందించాలి. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.
– కాసర్ల తిరుపతి రెడ్డి, ప్రైవేట్ ఉద్యోగి, కనగర్తి
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ..
డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేశాను. పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఎంత పనిచేసినా గుర్తింపు లేదు. ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చని ఉద్యోగం వదిలేసి వచ్చాను. వ్యవసాయం చేస్తున్నా. 5 ఎకరాల్లో బంతి పూల తోటతో పాటు వరి, పత్తి సాగు చేస్తూ స్వయంగా ఉపాధి పొందుతున్నా. వ్యవసాయంతో పాటు బాయిలర్, దేశీ కోళ్ల పెంపకం చేపట్టి పౌల్ట్రీ రంగంపై దృష్టి సారించాలి అనుకుంటున్నా.
– పడిగె నరేందర్, బ్యాంక్ ఉద్యోగి, చిన్నబోనాల