Taliban: తాలిబన్ మంత్రితో భారత విదేశాంగ కార్యదర్శి భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్

by vinod kumar |
Taliban: తాలిబన్ మంత్రితో భారత విదేశాంగ కార్యదర్శి భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) అప్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) తో దుబాయ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మానవతా సాయం, చాబహార్ ఓడరేవు ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు శరణార్థుల పునరావాసం వంటి కీలక అంశాలపై చర్చించినట్టు విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలకు సంబంధించిన అనేక సమస్యలపైనా డిస్కస్ చేసినట్టు పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని భారత్ నిర్ణయించింది. అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను కొనసాగిస్తామని, రాబోయే కాలంలో మరింత పెంచుతామని స్పష్టం చేసింది. ఈ సహాయానికి ఆఫ్ఘన్‌ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, భారత్ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్‌కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల మందులు, 27 టన్నుల భూకంప ఉపశమన సామగ్రి, 40,000 లీటర్ల పురుగుమందులు,100 మిలియన్ పోలియో డోసులు, 1.5 మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తదితర సహాయాన్ని అందజేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల పాకిస్థాన్ చేసిన వైమానిక దాడులను భారత్ ఖండించిన నేపథ్యంలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed