బెల్జియంలో మెహుల్ చోక్సీ

by John Kora |
బెల్జియంలో మెహుల్ చోక్సీ
X

- స్విట్జర్లాండ్ పారిపోవడానికి ప్లాన్?

- బెల్జియం అధికారులతో భారత్ సంప్రదింపులు

- భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు?

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13 వేల కోట్లకు మోసం చేసి, దేశం విడిచి వెళ్లిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెహుల్ ప్రస్తుతం బెల్జియంలో ఎఫ్ కేటగిరీ రెసిడెన్సీ కార్డును పొందాడని, తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి అక్కడే నివశిస్తున్నట్లు తెలిసింది. భారత్‌లో పీఎన్‌బీని మోసం చేసిన తర్వాత ఆంటిగ్వా అండ్ బార్చువాకు పారిపోయాడు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రాం కింది అక్కడే సిటిజన్‌షిప్ సాధించి నివాసం ఉన్నాడు. అయితే 2023 నవంబర్ 15న మెహుల్ చోక్సీ బెల్జియంకు వెళ్లినట్లు తెలిసింది. తప్పుదోవ పట్టించేలా ఉన్న మోసపూరిత పత్రాలను ఉపయోగించి బెల్జియం రెసిడెన్సీని పొందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం బెల్జియం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించాలని కోరినట్లు తెలిసింది.

కాగా, బెల్జియం అధికారులు తనను భారత్‌కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. హిర్స్‌లాండెన్ క్లినిక్‌లో చికిత్స పొందాలనే కారణం చూపి స్విట్జర్లాండ్‌కు మకాం మార్చాలని భావిస్తున్నాడు. యాంటిగ్వా నుంచి బహిష్కరణ వేటును తప్పించుకోవడానికి హ్యుమానిటీ రిజన్స్ చూపించడానికి మెహుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో కూడా చట్టపరమైన, వలస లొసుగులను వినియోగంచుకున్నందుకు చోక్సీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అతనికి రెసిడెన్సీని మంజూరు చేయడానికి ముందు బెల్జియం అధికారులు సరైన శ్రద్ద వహించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బెల్జియం అధికారులు మరో సారి ఆ తప్పు చేయకూడనది భావిస్తున్నట్లు తెలిసింది.

భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటైన పీఎన్‌బీ బ్యాంకు మోసం తర్వాత 2018లో మెహుల్ చోక్సీ ఇండియా నుంచి పారిపోయాడు. సెప్టెంబర్ 2019లో ఎఫ్ఈఓ చట్ట ప్రకారం అతడిని ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. ఆంటిగ్వాకు పారిపోయిన తర్వాత 2021లో కిడ్నాప్‌కు పాల్పడినట్లు చోక్సీపై ఆరోపణలు ఉన్నాయి. తనను అప్పగించకుండా ఉండేందుకు లంచాలను కూడా ఉపయోగించినట్లు తెలిసింది. ఇప్పుడు బెల్జియంలో కూడా అదే రకమైన ప్రణాళికతో ఉన్నట్లు మీడియా పేర్కొంది.

Next Story