- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

దిశ, కామారెడ్డి : మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా స్థాయి నార్కో- కో ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలనకై వాల్ పోస్టర్లు ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కోరారు. గంజాయి నిర్మూలనలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల ప్రభావానికి ప్రజలు దూరంగా ఉండేలా పోలీస్, విద్యా, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్, వ్యవసాయ, డాగ్స్ నియంత్రణ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై చిన్నారులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని కోరారు. మాదకద్రవ్యాల ప్రలోభాలకు గురైన వారికి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందని, దానిని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
వ్యవసాయ, అటవీశాఖ అధికారులు గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 5 గంజాయి కేసులను నమోదు చేశారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్, బిచ్కుంద, భిక్నూర్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో.. పాటు అది ఒక వ్యసనంగా మారుతుందన్నారు. నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఆయన సూచించారు.
జిల్లాలో కల్లు దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత డిపార్ట్మెంట్లు కలిసి కల్లు దుకాణాలు చెక్ చేసి వాటిని శాంపుల్ సేకరించి ల్యాబ్ పంపి, వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆల్ఫాజోలం గుర్తించినట్లయితే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల సమాచారాన్ని తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే సెల్ నెం. 8712686133 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలు విక్రయించినా, తీసుకున్న వారికి కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏ ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్టిఓ శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ రాజు, ఎక్సైజ్ సూపరింటిండెంట్ హన్మంతు రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ రాజా రెడ్డి, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం, సీ డబ్ల్యూసీస్వర్ణలత, జిల్లా అటవీ శాఖ అధికారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.