- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SBI: ఏటీఎం విత్‌డ్రాల నుంచే రూ. 2,043 కోట్లు సంపాదించిన ఎస్‌బీఐ

దిశ, బిజినెస్ బ్యూరో: కస్టమర్లు ఏటీఎంల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించింది. అయితే, ఇదే విషయంలో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) నష్టాలను చూడటం గమనార్హం. ఈ మేరకు కేంద్రం పార్లమెంటుకు వివరాలను తెలియజేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణీత పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలపై ఆదాయాన్ని ఆర్జించాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గణాంకాలను తెలియజేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటీఎం విత్‌డ్రాల ద్వారా ఎస్‌బీఐ రూ. 2,043 కోట్ల లాభాలను సాధించగా, తొమ్మిది పీఎస్‌బీలు ఏకంగా రూ. 3,738.78 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకులు మాత్రమే ఎస్‌బీఐతో పాటు ఏటీఎం విత్‌డ్రా నుంచి వరుసగా రూ. 90.33 కోట్లు, రూ. 31.42 కోట్ల లాభాలను సాధించాయి. గత ఐదేళ్లలో ఏటీఎం లావాదేవీల ద్వారా వచ్చే ఛార్జీల ఆదాయంలో ఎస్‌బీఐ మాత్రమే ఇతర పీఎస్‌బీల కంటే మెరుగైన ఆదాయాన్ని చూసింది.
2019-2024 మధ్య ఐదేళ్ల కాలంలో వివిధ పీఎస్‌బీల ఏటీఎం లావాదేవీలపై పొందిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 824.35 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 539.69 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 233.08 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 346.75 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 633.37 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ. 300.23 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ. 25.33 కోట్లు, యూకో బ్యాంక్ రూ. 287.89 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 668.84 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయి. కెనరా బ్యాంక్ రూ. 31.42 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 90.33 కోట్లు మాత్రమే ఎస్‌బీఐ బాటలో లాభాలు చూశాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం, ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను నెలకు ఐదు ఉచితంగా నిర్వహించవచ్చు. అలాగే, కస్టమర్లకు ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నిర్దేశించిన సంఖ్యలో ఉచిత లావాదేవీలు ఉంటాయి. మెట్రో కేంద్రాలలో మూడు లావాదేవీలు, నాన్-మెట్రో కేంద్రాలలో ఐదు లావాదేవీలను ఉచితంగా చేసేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఉచిత లావాదేవీలు దాటిన తర్వాత, సంబంధిత బ్యాంక్ బోర్డు ఆమోదించిన దాని ప్రకారం, ప్రతి ఏటీఎం లావాదేవీకి కస్టమర్‌లపై ఛార్జీలు విధిస్తారు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 21 ఉంటుంది.