247 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. 8 మంది అరెస్ట్..

by Aamani |
247 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. 8 మంది అరెస్ట్..
X

దిశ,తాండూర్ : తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. అచ్చలాపూర్ గ్రామ సమీపంలోని సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యాన్ లో నుండి కారులో నకిలీ పత్తి విత్తనాలను డంపు చేస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేయగా దాదాపు రూ.6,17,500 విలువ చేసే 247 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమైనాయి.

వాహనాలు, నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని శేగ్గం సందీప్, గాడిపల్లి సత్యనారాయణ, బొగే సాయి కిరణ్ కుమార్, మైదాo నారాయణ,పొట్లపల్లి రమేష్, కుంచె వెంకటేష్, కోడిపెల్లి సత్యం, పుప్పల తిరుపతిలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మనోహర్ రెడ్డి సహా మరో నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశాలున్నాయన్నారు. నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని డీసీపీ సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన, కొనుగోలు చేసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని డీసీపీ పేర్కొన్నారు. సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ కుమారస్వామి, ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య, ఏవో సుష్మ, పాల్గొన్నారు.



Next Story