గతేడాది వేటు వేశారు.. శ్రేయస్ అయ్యర్‌కు ఈ సారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఖాయమేనా?

by Harish |
గతేడాది వేటు వేశారు.. శ్రేయస్ అయ్యర్‌కు ఈ సారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఖాయమేనా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల క్రికెట్ జట్టు వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరికి చోటు దక్కుతుంది?.. ఎవరిపై వేటు వేస్తారు? అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతుంది. టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బోర్డు తిరిగి పునరుద్ధరించనున్నట్టు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ఆడని కారణంగా అయ్యర్, ఇషాన్ కిషన్‌పై గతేడాది బోర్డు వేటు వేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది.

అయితే, ఇటీవల అతను దేశవాళీతోపాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తాచాటాడు. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 243 రన్స్ చేసి భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏ భారత ఆటగాడైనా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే క్యాలెండర్ ఇయర్‌లో 3 టెస్టుల, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడాలి. అయ్యర్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పునరుద్ధరించాలని చూస్తున్నదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కడంపై అనిశ్చితి నెలకొంది.

మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించనున్నారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్, రజత్ పాటిదార్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్‌లను పక్కనపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29న గువహతిలో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


Next Story