New Mexico: అమెరికాలో మరోసారి కాల్పులు.. న్యూ మెక్సికోలో ముగ్గురు మృతి

by vinod kumar |
New Mexico: అమెరికాలో మరోసారి కాల్పులు.. న్యూ మెక్సికోలో ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సికో (New Mexico) రాష్ట్రంలోని లాస్ క్రూసెస్‌‌ నగరంలో ఉన్న ఓ పార్కులో శనివారం జరిగిన సామూహిక కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 14 మంది గాయపడ్డారు. నగరంలోని యంగ్ పార్క్ అనే సంగీత, వినోద వేదికలో ఓ ఈవెంట్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు లాస్ క్రూసెస్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాగా మరొకరు 14 ఏళ్ల బాలుడు ఉన్నట్టు వెల్లడించారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యక్ష సాక్షులు, ప్రజల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియోల, ఫొటోలు ఉంటే తమకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, లాస్ క్రూసెస్ నగరం దక్షిణ న్యూ మెక్సికోలోని రియో ​​గ్రాండే నది వెంబడి చివాహువాన్ ఎడారి వద్ద యూఎస్-మెక్సికన్ సరిహద్దుకు ఉత్తరాన 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెక్సికోలో ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి. ఈ ఏడాది జనవరిలోనూ ఆగ్నేయ మెక్సికోలోని విల్లాహెర్మోసా నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Next Story

Most Viewed