ICC Champions Trophy 2025 : ఈనెల 12కి ముందే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

by Sathputhe Rajesh |
ICC Champions Trophy 2025 : ఈనెల 12కి ముందే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025‌కు సంబంధించి భారత జట్టును ఈనెల 12 కన్నా ముందే ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును ఈ నెల 11న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదే రోజు జట్టును ప్రకటించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. భారత్-పాకిస్తాన్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటి వరకు కేవలం ఇంగ్లాండ్ మాత్రమే తమ జట్టును ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సహా ఇతర జట్లు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి తాత్కాలిక జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12ను ఐసీసీ గడువుగా విధించింది. దీంతో గడువు కన్నా ముందే భారత్ తమ జట్టును ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. గాయాలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని తుది జట్లను ప్రకటించేందుకు ఫిబ్రవరి 13ను డెడ్‌లైన్‌గా విధించింది.

స్క్వాడ్‌లో కీలక ఆటగాళ్లకు చోటు..

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీలకు ఖచ్చితంగా జట్టులో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణించడంతో మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, షమీలు సైతం జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. 2023 వరల్డ్ కప్లో వీరి ఆటతీరును పరిగణలోనికి తీసుకోనున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ తర్వాత భారత్ 6 వన్డేలు ఆడగా..జడేజా, షమీలకు విశ్రాంతిని ఇచ్చారు. పేలవమైన ఫామ్ కారణంగా కేఎల్ రాహుల్‌ను శ్రీలంక, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి భారత్ తప్పించింది. మరోవైపు యశస్వి జైస్వాల్ జట్టులో స్థానం విషయంలో గట్టి పోటిదారుడిగా నిలిచాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ కావడం.. వరుసగా రాణిస్తుండటంతో జైస్వాల్ బెర్త్ కన్ఫార్మ్ అని తెలుస్తోంది.గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. దీంతో వీరికి సైతం భారత జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక సెలక్టర్లకు పెను సవాల్‌గా మారింది.

Advertisement

Next Story