‘కొడాలి నానిని రోడ్డుపై కొట్టుకుంటూ పరుగెట్టిస్తా’

by srinivas |   ( Updated:2021-08-21 05:50:17.0  )
‘కొడాలి నానిని రోడ్డుపై కొట్టుకుంటూ పరుగెట్టిస్తా’
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ వేడి రాజుకుంటుంది. అధికార వైసీపీ.. ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటలదాడికి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారిలో మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లపై విరుచుకుపడటంలో కొడాలి నానికి ఎవరూ సాటిరారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే టీడీపీ నేతలు కొడాలి నానిని టార్గెట్ చేశారు. కొడాలి నానిపై ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. బూతుల మంత్రి అంటూ ఎదురుదాడికి దిగుతూ ఉంటారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంత్రి కొడాలి నానికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కొడాలి నానిని ‘అంకుశం’ సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానని హెచ్చరించారు. రామిరెడ్డి గతే పడుతుందని గట్టిగా హెచ్చరించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కొడాలి నాని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టావన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు భిక్ష పెడితేనే ఎమ్మెల్యే అయిన నీవు ఆయనపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తావా అంటూ మండిపడ్డారు. యరపతినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Advertisement

Next Story