ఎమ్మెల్సీ చల్లా మృతి.. వైసీపీలో తీవ్ర విషాదం

by Anukaran |   ( Updated:2021-01-01 01:55:37.0  )
ఎమ్మెల్సీ చల్లా మృతి.. వైసీపీలో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ భ్యులకు సానుభూతి తెలిపారు.

చల్లా ప్రస్థానం…

కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి.

కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైసీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. చల్లా మృతితో కర్నూల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed