ట్రెండింగ్..నెల్లూరు కార్పొరేషన్‌లో గొడుగులతో ఎన్నికల ప్రచారం

by srinivas |   ( Updated:2021-11-10 04:32:36.0  )
ట్రెండింగ్..నెల్లూరు కార్పొరేషన్‌లో గొడుగులతో ఎన్నికల ప్రచారం
X

దిశ, ఏపీ బ్యూరో: సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటేనే చాలా హంగామా, హడావిడి ఉంటుంది. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది.. ఓటర్లను ఆకర్షించేది కూడా ప్రచారమే. అందుకే ఎన్నికల ప్రక్రియలో ప్రచారమే ప్రధాన ఘట్టంగా అన్ని పార్టీలు భావిస్తాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పడేపాట్లు అన్నీ ఇన్నీకావు. తాయిళాల సంగతి అటుంచితే ప్రచారంలో ఎంతమందిని మెప్పించాము.. ఇతర పార్టీలకంటే ఎంత వినూత్నంగా ప్రచారం నిర్వహించాము అన్నదే చర్చ. కొన్ని పార్టీలు అయితే పార్టీ సింబల్‌ను ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఫ్యాన్.. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చి చూపించేవారు. అలాగే జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ కూడా.

ప్రత్యేక ఆకర్షణగా గొడుగులు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రోజురోజుకు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నెల్లూరులో వర్షాలు కురుస్తుండటంతో అభ్యర్థులు గొడుగులతో ప్రచారం చేస్తున్నారు. వర్షం కురిస్తే గొడుగులతో ప్రచారం చేయడం కామనే కదా అనుకుంటారు. కానీ వైసీపీ వారు పార్టీ గొడుగులతో ప్రచారం చేస్తుండటం ఇక్కడ కొసమెరుపు. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యేకంగా వైసీపీ రంగులతో కూడిన గొడుగులను వేసుకుని మరీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గొడుగులపై వైసీపీ జెండాతోపాటు వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఫోటోలతో ఉన్న గొడుగులను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారు. వర్షం కురుస్తున్నా గొడుగులు వేసుకుని ఇంటింటికీ తిరిగి మరీ ప్రచారం చేస్తున్నారు.

సుత్తికొడవలి నక్షత్రం గుర్తుతో ఎర్రటి గొడుగు

నెల్లూరు నగరంలో ఓ వైపు ఒకటే వర్షం కురుస్తుంటే మరోవైపు పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం రకరకాలుగా ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీపీఎం నేతలు తాము వైసీపీకి ఏమీ తక్కువ కాదని నిరూపించారు. వారు సైతం తమ పార్టీకి గుర్తుగా ఎరుపు గొడుగులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గొడుగుపై సుత్తి, కొడవలి నక్షత్రం ఉన్న ఎర్రటి గొడుగులతో నెల్లూరు నగరంలో సీపీఎం అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీల గొడుగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed