బతుకు పంజరంలో బంగారు తల్లులు!

by Shamantha N |   ( Updated:2020-03-07 05:13:34.0  )
బతుకు పంజరంలో బంగారు తల్లులు!
X

దిశ న్యూస్‌బ్యూరో/నల్లగొండ:

అమ్మ ఒడిలో ఓలలాడలేదు. నాన్న గుండెలపై బజ్జోలేదు. కన్నవారి చేత గోరు ముద్దల రుచి చూడలేదు. దిష్టి చుక్కలు, పూసలతో ముద్దొచ్చే సింగారాల ముచ్చటా లేదు. గళ్ గళ్‌మనే కాలి గజ్జెల సవ్వడులూ ధ్వనించలేదు. తల్లిదండ్రులతో కలిసి బుడి బుడి అడుగులు వేయలేదు. పేగు బంధం స్పర్శ మిళితంగా వేలు పట్టుకొని నడిపించిన జాడలూ లేవు. అమ్మా చిట్టి తల్లీ, బుజ్జమ్మా, బంగారం, లక్కీ, బేబీ, చిన్నారి వంటి ముద్దుముద్దు పిలుపులకూ నోచుకోలేదు. అసలు బారసాలలే ఎరుగరు. టాటా, బైబై అంటూ పరస్పర సైగలతో బడి బాట పట్టలేదు. ఓనమాలూ దిద్దలేదు. లిటిల్ ఫ్రెండ్స్‌తో ఆటలూ, పాటల లోకమూ చూడలేదు.‌ జన్మలో మళ్లీ దక్కని బాల్యపు తీపి అనుభూతులు ఏ ఒక్కటీ దక్కలేదు. వాళ్లకు ప్రాప్తించిందల్లా నిలువెల్లా చిదిమేయబడిన చేదు అనుభవాలే. ఊహే తెలియని ఏజ్‌లో, తమ బరువుకు మించిన బండెడు బట్టలుతకడం, గంపెడు గిన్నెలు తోమడం వంటి ఎన్నోరకాల చాకిరీలు ఫోర్సుగా చేయించబడ్డారు. టీనేజీకి వచ్చీరాకముందే దేహాన్ని పణంగా పెట్టే ట్రైనింగులోకి నెట్టివేయబడ్డారు. సహజంగా, సాధారణంగా పెరిగి పెద్దయి, ప్రయోజకులు కావాల్సిన దానికి నూరు శాతం భిన్నంగా క్షణక్షణం లెక్కకందని ఆంక్షల పంజరంలో అత్యంత భారంగా బతుకులీడ్చారు. నేటికీ తమ పేరెంట్సు ఎవరో తెలియని వ్యధాభరితమైన జీవితం గడుపుతున్నారా బంగారు తల్లులు.

గుట్టలోని గుట్టు రట్టయి.. ఉన్నంతలో గట్టెక్కి

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. దిగువన మామూలుగానే కనిపించే 110 పాపపు కూపాలు. వాటిల్లో ఫక్తు అమ్మాయిలు, ఆడవారి శరీరాలతో సిగ్గుపడాల్సిన దందా. అక్కడ 2018 జూన్ దాకా అదంతా ఓపెన్ సీక్రెట్. రొటీన్ మేటరే. కామనే కదా అనేంతటి తేలికభావం. ఒళ్లంతా పుండైన గాయాలతో అత్యంత దీనంగా అగుపించిన ఓ బాలిక గురించి ఎవరో మనుసున్న మారాజులు ఉప్పందించడంతో యంత్రాంగం దిల్‌తో కదిలింది. లోతైన గుట్టు ఫటాఫట్ రట్టయింది. షీ టీంల రూపంలో ఎందరో విధి వంచిత పాపాయిలు, యువతుల టైమొచ్చింది. సొరంగాలు, నేలమాళిగలు, డెన్ల మాదిరి సొరగుల్లో వస్తు సామగ్రిని, నిధి నిక్షేపాలను దాచిపెట్టినట్టుగా, ఆ అభాగ్యులను కుక్కి దాయడాలకు చెక్ పడింది. ఎన్నో తెలివి మీరిన ఆ టైపు అడ్డుగోడలను బద్ధలు కొడుతూ సుమారు 2 నెలలపాటు రైడ్స్ చేపట్టారు. అభంశుభం ఎరుగని బాలికలు, యువతుల వొళ్లుతో సంపాదన రుచి మరిగినోళ్లు అప్పటికి ఎందరిని తప్పించారో కానీ, మొత్తానికైతే 36 మందిని షీ టీమ్స్ కాపాడగలిగాయి. ఉన్నంతలో గట్టెక్కించాయి.

చలించిన హైకోర్టు.. సుమోటోగా కేసు

అక్కడ ఆడ పిల్లలపట్ల మతిలేని చేష్టలపై స్వయానా హైకోర్టు చలించిపోయింది. సుమోటోగా కేసును స్వీకరించింది. నాటి ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ స్వయంగా పర్యవేక్షించారు. నీచ నికృష్టపు దందా కోసం వయసుతో నిమిత్తం లేకుండా చిన్నారుల ఆకృతి కృత్రిమ వృద్ధికి సూదులు ఇచ్చారన్న అంశంపై తీవ్రంగా స్పందించారు. ‘పాపం వాళ్లు బాలిక‌లా? బ్రాయిల‌ర్ కోళ్లా!’ అని ఆవేదన వెలిబుచ్చారు. కేసు దర్యాప్తుపై ఎవ్రీ వీక్, ప్రతి బుధవారం ప్రొగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని అరుదైన ఆదేశాలిచ్చారు. మరో కీలకమైన అడ్వయిజూ చేశారు. ఆ తరహా బాధితురాళ్లకు సత్వర న్యాయం కోసం ఫ్రెండ్లీ కోర్టు స్పెషల్‌గా స్థాపించాలని సిఫార్సు చేశారు. ఈ కేసు విచారణ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌డానికి ఆ కోర్టును ప్రత్యేకించాలని 2018 డిసెంబ‌రులోనే సీజే తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఇన్నాళ్లయినా సర్కారు మాత్రం సెపరేట్ న్యాయస్థానం ఏర్పాటును పెండింగ్‌లోనే ఉంచుతోంది.

అమ్మా నాన్న ఎవరన్నదానిపై ఆశ నిరాశలు..

ఆ రాకెట్ బట్టబయలై..36 మంది బాలికలు, యువతులు సేఫ్ జోన్‌లోకి వచ్చారు. లోగడ మిస్సయిన తమ పిల్లల కోసం అప్పటికే వెతుకుతున్న పలు ఫ్యామిలీల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఆ అమ్మాయిలు తమ వారేనంటూ ఏపీలోని గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, మన రాష్ట్రంలోని వరంగల్ తదితర ఏరియాలకు చెందిన 14 కుటుంబాలు మొరపెట్టుకున్నాయి. ఆ విధి వంచితులు ఎవరి సంతానమో తేల్చి, అప్పగించడానికి అధికార యంత్రాంగం సైంటిఫిక్ మెథడ్‌ను ఎంచుకున్నది. డీఎన్ఏ టెస్టులు చేయించింది. ఒక్కో కిట్ రూ.4 లక్షల ఖరీదైనదట. అట్లాంటివి సుమారు 70 తెప్పించారు. అందుకు ఏడాది పట్టింది. 36 మంది బాధితురాళ్లతోపాటు పిల్లలు తమవారేనని అంటున్న పేరెంట్స్‌కు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. ఫలితాల్లోనైతే జెస్ట్ ముగ్గురు శిశువులవే మ్యాచ్ అయ్యాయి. ఆ ముగ్గురిలో ఒక పాప కన్నవారి చెంతకు చేరింది. మిగతా ఇద్దరు పాలబుగ్గలోళ్ల తల్లి/తండ్రి జైలులో ఉండడంతో, అప్పగించే ప్రక్రియకు వేచి చూస్తున్నారు. తతిమ్మా 33 మంది అమ్మాయిల తల్లిదండ్రుల గురించి పోలీసు అన్వేషణ కొనసా..గుతున్నది.

చదువుల బాటలో..సరస్వతీదేవి ఒడిలో..

ఆ బంగారు తల్లులు కన్నవారి చెంతకు చేరడం కాలం చేతిలో పడింది. ఆరేళ్ల లోపు వయసున్న ఏడుగురిని న‌ల్ల‌గొండ శిశు గృహంలో, 15 ఏళ్లు దాటని 26 మందిని రంగారెడ్డి జిల్లా ఆమ‌న్‌గ‌ల్ ప్ర‌జ్వ‌ల హోంలో ప్రస్తుతానికి ఉంచారు. వాళ్లు బడి బాట పట్టారు. చదువులమ్మ సరస్వతిదేవి ఒడిలోకి చేరారు. 18 ఏళ్ల వయసు పైబడిన ఇద్దరు యువతులు నల్లగొండలోనే స్వ‌యం ఉపాధి కోర్సులు నేర్చుకుంటున్నారు. ఏండ్లుగా అనుభవించిన నరక కూపాల నుంచి బయటపడి, సాధారణ జీవితానికి దగ్గరవుతున్నారు. విద్యా బుద్ధులు అలవర్చుకొని తమదైన లైఫ్ కోసం ఆశపడుతున్నారు. తల్లిదండ్రుల ఒడికి చేరాలన్న తపన ఓవైపుండగా, బంగారు భవిత సొంతానికి కష్టపడాలన్న తపన వాళ్లలో తొణికిసలాడుతున్నది. పోలీసు శాఖ ఐపీఎస్‌లలో దుర్జన భయంకరులు, ‘సజ్జన’ శుభంకరులుంటారు. లైంగిక దాడి చేసి, ఆపై చంపేసే ఉన్మాదులను అదే చోట ఎన్‌కౌంటర్ చేసేసినట్టే..ఒక్కో ఐపీఎస్‌లో ఒక్కో స్పెషాలిటీ! అట్లే, మానవ అక్రమ రవాణాను అరికట్టి, బాలికలు, యువతులను రక్షించడంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రత్యేక చొరవ చూపిస్తుంటారు. ఆ 3 డజన్ల అమ్మాయిల ఉజ్వల భవిత కోసం ఆయన పట్టుదలతో ఉన్నారు. వారి తల్లిదండ్రులెవరో కనిపెట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లలో నమోదైన పిల్లల మిస్సింగ్ కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తప్పిపోయిన గాళ్స్ వివరాలను పోల్చి చూస్తున్నారు.

బుద్ధిమారని లీడర్లు

ఇంత జరిగినా కొందరు లోకల్ లీడర్ల బుద్ధి మారడంలేదు. పాపపు కూపాల ఓట్లు వాళ్లకు కావాల్సి వచ్చాయి. అప్పట్లో 22 ఇండ్లను రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లు సీజ్ చేయగా, ఓ ప్ర‌జాప్ర‌తినిధి ఆ మధ్య సీళ్లు తెరిపించారు. మునిసిపల్ ఎన్నికల టైంలో తెరచాటున ఈ కథ నడిపించారు.

త్వ‌ర‌లో ట్ర‌య‌ల్ స్టార్ట్ అవుతుంది కె.నారాయ‌ణ‌రెడ్డి భువ‌న‌గిరి డీసీపీ

యాద‌గిరిగుట్ట వ్య‌భిచారగృహాల నిర్వ‌ాహ‌కుల‌పై న‌మోదైన కేసులపై న‌ల్ల‌గొండ కోర్టులో త్వరలో ట్ర‌య‌ల్ స్టార్ట్ అవనుంది. నిందితుల‌కు క‌చ్చితంగా శిక్షపడేలా చూస్తాం. శాస్ర్తీయ సాక్ష్యాధారాల‌ను సేక‌రిస్తున్నాం. బాలిక‌ల అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి 23 కేసులు రాశాం. అందులో 9 కేసులు పోక్సో కోర్టు ప‌రిధిలోకి రాగా, కడమ 14 కేసులు మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా కిందకు వచ్చాయి. బాధ్యులైన 29 మందిపై పీడి యాక్టు పెట్టి, కటకటాల వెనక్కి నెట్టాం. విముక్తి కలిగించిన 36 మంది బాలిక‌ల్లో ఒక పాప సొంత ఇల్లు చేరగా, కడమ వారిని వసతి గృహాల్లో ఉంచి విద్యా బుద్దులు నేర్పిస్తున్నాం. వీరికి డీఎన్ఏ ప‌రీక్ష‌లు చేయించగా, ఆరేళ్ల లోపున్న ముగ్గురు పిల్ల‌లవే మ్యాచ్ అయ్యాయి. మిగతా 33 మంది పిల్ల‌ల డీఎన్ఏ స‌రిపోలలేదు. వారి త‌ల్లిదండ్రులు ఎవ‌ర‌న్న‌ది నిర్ధారించడం స‌వాల్‌గా మారింది. చాలా సీరియ‌స్‌గా ఎఫ‌ర్ట్ పెడుతున్నాం.

హాయిగా చ‌దువుకుంటున్నారు -కృష్ణ‌వేణి, స్త్రీ శిశు సంక్షేమశాఖ యాదాద్రి జిల్లా పీడీ

ఆ 36 మంది పిల్ల‌ల‌ను పోలీసులు మాకు అప్ప‌గించారు. ఆ బాలికల బాగోగులకు గరిష్ట ప్రాధాన్యం ఇస్తున్నాం. వారి ఉన్నతికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఆ అమ్మాయిలు గతం గాయాలను మరిచిపోయి, కొత్త ప్ర‌పంచంలోకి వ‌చ్చారు. హాయిగా చ‌దువుకుంటున్నారు.

tags : yadagirigutta victims, 36 girls, DNA tests, 1 case match, 35 victims now students, rachakonda cp

Advertisement

Next Story