నెక్స్ట్ బంగ్లాదేశ్ లో ఏం జరగనుంది?

by M.Rajitha |
నెక్స్ట్ బంగ్లాదేశ్ లో ఏం జరగనుంది?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై ఏర్పడిన అల్లర్ల వల్ల ఇపుడా దేశం మహా సంక్షోభంలో పడింది. ఇప్పటి వరకు జరిగిన గోడవల్లో 300 మందికి పైగా చనిపోయారు. అల్లర్లను అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారు.

మరిపుడు ఆ దేశంలో ఏం జరగనుంది..?

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లు తొలగించాలంటూ అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే ఆ నిరసనలు దేశం మొత్తం వ్యాపించినప్పటికీ, హసీనా ప్రభుత్వం వాటిని అదుపు చేయకపోగా... విద్యార్థులు అలాంటి కలలు మానండి, అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాము అని చేసిన ప్రకటనతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. దేశం మొత్తం కర్ఫ్యూ విధించి, ఇంటర్నెట్ నిలిపివేసారు. అయినప్పటికీ నిరసనలు, ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. ఈ గొడవలు జరుగుతుండగానే జూలై 21న ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను 5 శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆ దేశ సుప్రీం కోర్ట్ ఆదేశించింది. 93 శాతం మెరిట్ ఆధారంగా మాత్రమే నియామకాలు జరగాలని, మిగిలిన రెండు శాతంలో గిరిజనులకు, ట్రాన్స్ జెండర్లకు, వికలాంగులకు కేటాయించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ విద్యార్థులు.. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగించారు. ఈ రిజర్వేషన్ల అంశం ఆగస్ట్ 7న మళ్ళీ సుప్రీం కోర్టుకు రానుండటంతో ఆగస్ట్ 4 నుండి కొన్నివేలమంది నిరసనకారులు రోడ్డెక్కి, దేశాన్ని కొద్ది గంటల వ్యవధిలో రక్తసిక్తం చేశారు. నిన్న ఒక్కరోజే 70 మందికి పైగా ఈ హింసలో ప్రాణాలు కోల్పోయారంటే గొడవల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ గొడవలు అదుపు చేయలేక ఏకంగా బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.

ఇక ఆగస్ట్ 7న సుప్రీం కోర్టులో విచారణకు రానున్న ఈ అంశంపై ఎలాంటి తీర్పు వెలువడనుందో దేశం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అనుకూలంగా స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తే అమరుల కుటుంబాలు కూడా రోడ్డెక్కడం ఖాయమని తెలుస్తోంది. రెండు వర్గాలు ఆందోళనకు దిగి మళ్ళీ అల్లర్లకు పాల్పడితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండనుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Next Story