ఎట్టకేలకు కనిపించిన ప్రిగోజిన్.. బెలారస్‌లో ప్రత్యక్షమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్

by Vinod kumar |
ఎట్టకేలకు కనిపించిన ప్రిగోజిన్.. బెలారస్‌లో ప్రత్యక్షమైన వాగ్నర్ గ్రూప్ చీఫ్
X

మిన్స్క్‌(బెలారస్‌) : రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌పై జూన్ 23న తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ "వాగ్నర్ గ్రూప్" అధిపతి ఎవ్గెనీ ప్రిగోజిన్‌ ఎట్టకేలకు కనిపించాడు. రష్యా మిత్రదేశం బెలారస్‌లో ప్రిగోజిన్‌ తన సైనికులతో సమావేశమైన వీడియో ఒకటి బయటికొచ్చింది. వాగ్నర్‌ గ్రూప్ దళాలకు అనుకూలంగా పోస్టులు పెట్టే పలు టెలిగ్రామ్‌ ఛానళ్లలో మొదట ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వెంటనే ఈ వీడియో ప్రిగోజిన్‌ అఫీషియల్ అకౌంట్‌లోనూ పోస్టు అయ్యింది. ఈ వీడియోలో ప్రిగోజిన్‌ లా కనిపిస్తున్న వ్యక్తి తన చుట్టూ నిలబడిన వాగ్నర్‌ గ్రూప్ సైనికులను వెల్కమ్ చెబుతాడు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై వారితో మాట్లాడుతాడు. "మీకు స్వాగతం. మీ అందరినీ పలకరించడం నాకు సంతోషంగా ఉంది. బెలారస్‌కు స్వాగతం. మనం గౌరవప్రదంగా పోరాడాం. రష్యా కోసం మనం ఎంతో చేశాం. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు అవమానకరంగా ఉంది. అందులో మనం పాల్గొనాల్సిన అవసరం లేదు.

అయితే మన శక్తిని నిరూపించుకునే సమయం కోసం వేచి చూద్దాం. ఇప్పుడైతే ఆఫ్రికా వెళదాం.. సమయం వచ్చినప్పుడు తిరిగి ఉక్రెయిన్‌లో అడుగుపెడదాం" అని చెబుతాడు. ఒకవేళ ఈ వీడియోలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రిగోజినే అయి ఉంటే.. వాగ్నర్‌ గ్రూపు మళ్లీ యుద్ధంలో పాల్గొంటుందనే సంకేతాలు ఇచ్చాడంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కొందరు వాగ్నర్‌ యోధులు ఓ కాన్వాయ్‌లో జులై 18న బెలారస్‌ కు చేరుకున్నారని తెలుస్తోంది. తమ సైన్యానికి శిక్షణ ఇవ్వాలని వాగ్నర్‌ ప్రైవేటు సైన్యానికి బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఇటీవల విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed